జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు 80 శాతం వారే!!

ABN , First Publish Date - 2020-11-21T05:59:21+05:30 IST

త్వరలో జరగబోయే గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో గతంలో ఎవరినైతే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందో...వారిలో 80 నుంచి 90 శాతం కొనసాగుతారని, మిగిలిన వారిని మారుస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు.

జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు 80 శాతం వారే!!

మిగిలిన వారిని మారుస్తాం

పార్టీ సమావేశంలో విజయసాయిరెడ్డి వెల్లడి


విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో గతంలో ఎవరినైతే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందో...వారిలో 80 నుంచి 90 శాతం కొనసాగుతారని, మిగిలిన వారిని మారుస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఈ విషయం ప్రస్తావించారు. పార్టీని నమ్ముకొని చాలామంది బాగా ఖర్చు చేశారని, అయితే వారిలో కొందరు అనుమానంగా వున్నారని, ఏదో ఒక నిర్ణయం చెప్పకపోతే వారు చేజారిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి, బీఫారాలు ఇచ్చిన వారిలో అత్యధికులు అలాగే వుంటారని, ఎటువంటి మార్పులు వుండవని స్పష్టంచేశారు. అయితే కొందరు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని, వారిపై నివేదికలు ఉన్నాయని, అలాంటి చోట్ల మార్పులు తప్పవని పేర్కొన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రకటించలేదు కదా! అని 

నిర్లక్ష్యంగా ఉంటే.. ‘తాబేలు...కుందేలు’ కథలా పరిస్థితి మారుతుందని, తెలుగుదేశం సీట్లు తన్నుకుపోతుందని, నిత్యం అప్రమత్తంగా, ప్రజల మధ్య వుండాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T05:59:21+05:30 IST