పాలిసెట్‌లో 81.75% పాస్‌

ABN , First Publish Date - 2021-07-29T09:09:39+05:30 IST

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలు విదులయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్‌ శ్రీనాథ్‌ తదితరులు బుధవారం ఈ ఫలితాలు ప్రకటించారు.

పాలిసెట్‌లో 81.75% పాస్‌

‘ఎంబైపీసీ’లో అమ్మాయిల హవా

తొలి పది ర్యాంకుల్లో ఆరు కైవసం

‘ఎంపీసీ’లో ఐదుగురికి 118 మార్కులు

ఆగస్టు 5నుంచి అడ్మిషన్ల ప్రక్రియ షురూ

సెప్టెంబరు 1న కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి

అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభం


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలు విదులయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్‌ శ్రీనాథ్‌ తదితరులు బుధవారం ఈ ఫలితాలు ప్రకటించారు. పాలిసెట్‌లో మొత్తం 81.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత నెల 17న పాలిసెట్‌ నిర్వహించగా.. నమోదు చేసుకున్న 1,02,496 మంది అభ్యర్థుల్లో 92,557 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో 75,666(81.75శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 42,595 మంది బాలురు, 33,071మంది బాలికలు ఉన్నారు. పాలిసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు మెరిట్‌ ర్యాంకులను కేటాయించారు. ర్యాంకు కార్డులను https:// polycetts.nic.in, www. sbtet.telangana. gov.in, www.dtets.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు. అలాగే, స్కాన్‌ చేసిన ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని htt-p-s://polycetts. nic.in  ద్వారా అభ్యర్థి పరిశీలన కోసం పొందవచ్చని వెల్లడించారు. కాగా, ఈ సారి ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఐదుగురు విద్యార్థులు 118 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఎంబైపీసీ విభాగంలో మొదటి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఆరుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. కాగా, ఎంబైపీసీలో 117మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన కె.రిషిక ఎంపీసీ విభాగంలోనూ అంతే మార్కులు సాధించి ప్రతిభ చాటింది. 


అడ్మిషన్ల షెడ్యూల్‌ ఇదే

పాలిటె క్నిక్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 6 నుంచి 10వ తేదీ మధ్య సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత 6 నుంచి 12వ తేదీ మధ్య ఆప్షన్లు పెట్టుకోవాలి. ఆగస్టు 14వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి 20వ తేదీ మధ్య ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తుది విడత సీట్ల భర్తీని ఆగస్టు 23వ తేదీ  నుంచి చేపడతారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 1వ తేదీన ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. వీరికి అక్టోబరు 1నుంచి 4వ తేదీ వరకు ఓరియెంటేషన్‌, అక్టోబరు 6వ తేదీ నుంచి సాధారణ తరగతులు నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌ కౌన్సిలింగ్‌కు అభ్యర్థులకు విడివిడిగా కాల్‌ లెటర్లను పంపడం జరగ దని అధికారులు వెల్లడించారు. 


రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)లో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో ప్రవేశానికి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అందించే వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.pjtsau.edu.in, www.tsvu,nic.in లో చూడవచ్చని తెలిపారు. 



Updated Date - 2021-07-29T09:09:39+05:30 IST