81,466 దేశంలో 6 నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు

ABN , First Publish Date - 2021-04-03T07:02:50+05:30 IST

దేశంలో కరోనా రెండో దశ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. 50 వేలు.. 60 వేలు.. 70 వేలు.. 80 వేలు

81,466 దేశంలో 6 నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు

  • కరోనాతో మరో 469 మంది మృతి.. మూడు నెలల గరిష్ఠం
  • మహారాష్ట్రలోనే 43 వేల పాజిటివ్‌లు 
  • ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో 9 రోజులు లాక్‌డౌన్‌
  • మధ్యప్రదేశ్‌లోని 4 జిల్లాల్లో కూడా
  • ఆస్పత్రిలో చేరిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ 
  • పుణెలో రాత్రి కర్ఫ్యూ.. హాళ్లు, బార్లు బంద్‌
  • వాద్రాకు కరోనా.. ప్రియాంక ఐసోలేషన్‌


న్యూఢిల్లీ, ముంబై, ఏప్రిల్‌ 2: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. 50 వేలు.. 60 వేలు.. 70 వేలు.. 80 వేలు..! ఇలా రోజురోజుకూ పాజిటివ్‌లు పెరుగుతూ పోతున్నాయి. రోజువారీ కేసుల్లో పదివేల వరకు పెరుగుదల ఉంటుండటం వైరస్‌ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది. గురువారం 81,466 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కంటే ఇవి 9 వేలు అధికం. కాగా, అమెరికా (77 వేలు)ను మించి భారత్‌లో అధికంగా కేసులు రావడం గమనార్హం. తాజాగా 469 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


దేశంలో 80 వేలపైగా కొత్త కేసులు రావడం అక్టోబరు 2 తర్వాత ఇదే తొలిసారి. మరోవైపు డిసెంబరు 6 అనంతరం అత్యధికంగా కరోనాతో 469 మంది మృతిచెందారు. 23 రోజులుగా కేసులు పెరుగుతూనే ఉండటంతో.. యాక్టివ్‌ కేసులు 6.14 లక్షలకు చేరాయి. గురువారం నాటి మరణాల్లో మహారాష్ట్రలోనే 249 ఉన్నాయి. పంజాబ్‌ (58), ఛత్తీ్‌సగఢ్‌ (34), తమిళనాడు (19), కర్ణాటక (18)ల్లో రెండంకెల సంఖ్యలో నమోదయ్యాయి. 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వెయ్యిపైనే కేసులు వచ్చాయి. గురువారం రికార్డు స్థాయిలో 36.70 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. 



పరిస్థితి మెరుగవకుంటే లాక్‌డౌనే: ఉద్ధవ్‌

మహారాష్ట్రలో కరోనా పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తోంది. తాజాగా అక్కడ 43 వేల కేసులు వచ్చాయి. ముంబై (8,500), పుణె (8 వేలు), నాగ్‌పూర్‌ (3,700)లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇదే తీరు కొనసాగితే ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నించారు. పరిస్థితి మెరుగుపడకుంటే లాక్‌డౌన్‌ తప్పదన్నారు. పుణెలో వారం పాటు సాయంత్రం ఆరు నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలుకు నిర్ణయించారు. రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌ను శనివారం నుంచి మూసివేయాలని ఆదేశాలిచ్చారు.


ఛత్తీ్‌సగఢ్‌ దుర్గ్‌ జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించనున్నారు. మధ్యప్రదేశ్‌ ఛింద్వారా, రాట్లాం, బేతుల్‌, కర్గోన్‌ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఢిల్లీలో కరోనా నాలుగో దశ నడుస్తోందని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా.. లాక్‌డౌన్‌ అవసరం లేదని పేర్కొన్నారు.





 గత నెల 27న పాజిటివ్‌ వచ్చిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (47)  వైద్యుల సలహా మేరకు ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. భర్త రాబర్ట్‌ వాద్రాకు కరోనా పాజిటివ్‌ రావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల నెగెటివ్‌ వచ్చింది. ప్రియాంక.. అసోం, కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (78) వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. కుమారుడు అభిషేక్‌ మినహా తమ కుటుంబ సభ్యులంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ హీరోయిన్‌ అలియా భట్‌ (28)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.


Updated Date - 2021-04-03T07:02:50+05:30 IST