కర్ణాటకలో 83కు చేరిన కరోనా బాధితులు.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-03-30T16:17:33+05:30 IST

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ...

కర్ణాటకలో 83కు చేరిన కరోనా బాధితులు.. ముగ్గురి మృతి

బెంగళూరు : రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆదివారం మరో ఏడుగురికి నిర్ధారణ అయింది. వీరిలో మైసూరు జిల్లా నంజన్‌గూడు ప్రాంతంలోని ఫార్మా కంపెనీలో పనిచేసేవారు ఐదుగురు కాగా మిగిలిన ఇరువురు ఉడిపి జిల్లాకు చెందినవారుగా తేలింది. వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించిన హెల్త్‌ బులెటిన్‌ వివరాలిలా ఉన్నాయి. శనివారం రాత్రిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 76మందికి వ్యాధి ప్రబలగా తాజాగా మరో ఏడుగురు చేరడంతో  ఆ సంఖ్య 83కు చేరింది. రాబోయే వారం రోజులలో మరింతగా రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావించి ఆ దిశగా వైద్య సహాయక చర్యలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. 


మైసూరు జిల్లా నంజన్‌గూడు ప్రాంతంలోని ఫార్మా కం పెనీలో పనిచేసే 39 ఏళ్ళ యువకుడికి నిర్ధారణ అయింది. అతడిని మైసూరు జిల్లాసుపత్రిలోని ఐసోలేషన్‌ విభాగానికి తరలించారు.  అదే కంపెనీలో పనిచేసే మరో 38 ఏళ్ళ వ్యక్తికి నిర్ధారణకాగా అతడిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.  మైసూరు జిల్లాకు చెందిన మరో 21 ఏళ్ల యువకుడికి, 31 ఏళ్ళ మరో వ్యక్తికి   కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే జిల్లాకు చెందిన 42 ఏళ్ళ వ్యక్తికి కూడా కొవిడ్‌-19 సోకడంతో అతడిని కూడా  మైసూరు జిల్లాసుపత్రిలోని ఐసోలేషన్‌ విభాగానికి తరలించారు. కాగా వీరందరూ  ఫార్మా కంపెనీ ఉద్యోగులే కావడం గమనార్హం.

 

వీరుకాకుండా ఉడిపి జిల్లాకు చెందిన మరో ఇద్దరికి కూడా కరోనా సోకింది. 35ఏళ్ళ ఓ వ్యక్తి ఈనెల 17న దుబైనుంచి మంగళూరుకు వచ్చారు. అక్కడి నుంచి హౌస్‌ క్వారెంటైన్‌లో ఉన్నారు. మూడు రోజులుగా జ లుబు, జ్వరం తీవ్రం కావడంతో గల్ల, రక్తపరీక్షలు జరిపించగా వ్యాధి నిర్ధారణ అయింది. ఉడిపిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.


ఇదే జిల్లాకు చెందిన 29 ఏళ్ళ యువకుడు ఇటీవల కేరళ రాష్ట్రం త్రివేండ్రం నుంచి వచ్చాడు. కరోనా నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. నంజన్‌గూడులోని ఫార్మాకంపెనీకి చెందిన ఉద్యోగి ఇటీవల సింగపూర్‌ నుంచి వెనుతిరిగి వచ్చాడు. అతడితో సన్నిహితంగా ఉండే వారిలో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరి కుటుంబ సభ్యులతో పాటు వీరికి సన్నిహితంగా ఉండే వారందరిపైనా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు నిఘా పెట్టారు. పలువురిని హోం క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతటికీ కలిపి 83మందికి పాజిటివ్‌ ఖరారు కాగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఐదుమందికి వైరస్‌ తగ్గిపోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. వివిధ ఆసుపత్రులలో 75మంది ఐసోలేషన్‌ వార్డులలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-03-30T16:17:33+05:30 IST