ఏపీ సచివాలయాన్ని కుదిపేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-01T22:08:31+05:30 IST

Corona AP Secretariat shaking

ఏపీ సచివాలయాన్ని కుదిపేస్తున్న కరోనా

అమరావతి: సచివాలయాన్ని కరోనా కుదిపేస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో 84 మంది ఉద్యోగులకు 2 వారాల పాటు వర్క్‌ఫ్రమ్‌ హోంకు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌ పూనం మాలకొండయ్య అనుమతి ఇచ్చారు. సచివాలయంలో వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌  కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ఇక్కడినుంచి 10 ఆర్టీసీ బస్సులు వెళ్లాయి. వాటిలో వచ్చిన ఉద్యోగుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు సచివాలయంలో పని చేస్తుండగా, మరో ఇద్దరు శాఖాధిపతుల కార్యాలయాలకు చెందినవారు. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారిని నేరుగా మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు తరలించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అందరికీ అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ సమయంలో ఎలాంటి భౌతిక దూరం పాటించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. తర్వాత రెండురోజుల పాటు వీరు కార్యాలయాలకు వెళ్లారు. శుక్రవారం బాగా పొద్దుపోయాక వీరికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో ఉద్యోగులంతా ఉలిక్కిపడ్డారు. సచివాలయంలో పనిచేస్తున్న వ్యక్తి నవులూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వసతిలో ఉంటున్నాడు. ఆయన రూమ్‌లో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు సహా మొత్తం ఆ అపార్ట్‌మెంటులో 40మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.


అయితే సచివాలయంలో కరోనా కలకలం రేపడంతో ఉద్యోగులు అంతంత మాత్రమే విధులకు హాజరయ్యారు. కరోనా వల్ల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తన రివ్యూ మీటింగ్‌ను సచివాలయంలో చేపట్టలేదు. విజయవాడలోని ఓ కార్యాలయం నుంచి గౌతమ్‌రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.


మరోవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం కొత్తగా 105 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 76, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 29మందికి కరోనా సోకింది. గత 24గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 34మంది డిశ్చార్జ్‌ చేశారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 3,676కి కరోనా పాజిటివ్‌ కేసులు చేరాయి. మొత్తం 2,169మంది డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం 886 యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 64మంది మృతి చెందారు.

Updated Date - 2020-06-01T22:08:31+05:30 IST