8,500 మంది ఓటీఎస్‌ కింద నగదు చెల్లించారు

ABN , First Publish Date - 2021-12-08T04:34:02+05:30 IST

జిల్లాలో ఇప్పటివరకు ఓటీఎస్‌ పథకం కింద 8,500 మంది లబ్ధిదారులు మాత్రమే నగదు చెల్లించారని జిల్లా హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే అన్నారు.

8,500 మంది ఓటీఎస్‌ కింద నగదు చెల్లించారు
ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలను పరిశీలిస్తున్న జేసీ విదేహ్‌ ఖరే

వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్లు

21 నుంచి లబ్ధిదారులకు పంపిణీ 

జేసీ విదేహ్‌ఖరే 


మనుబోలు, డిసెంబరు 7: జిల్లాలో ఇప్పటివరకు ఓటీఎస్‌ పథకం కింద  8,500 మంది లబ్ధిదారులు మాత్రమే నగదు చెల్లించారని జిల్లా హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే అన్నారు. మండలంలోని గురివిందపూడి సచివాలయాన్ని మంగళవారం   ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల ద్వారా తీస్తున్న రిజిస్ట్రేషన్ల పత్రాలను ఆయన జిల్లా రిజిస్ట్రార్‌ బాల ఆంజనేయులుతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించి కిందస్థాయి సిబ్బందికి దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటీఎస్‌ కింద 1.20లక్షల మంది లబ్ధిదారులు వస్తారన్నారు. వీరంతా ప్రభుత్వం చెప్పిన మొత్తం చెల్లించగలిగితే జిల్లాకు రూ.100కోట్లు వరకు రావాల్సి ఉందన్నారు.   నగదు చెల్లించాలని ఎవ్వరినీ ఒత్తిడి చేయడం లేదన్నారు. లబ్ధిదారులకు అవగాహన మాత్రమే కల్పించి వారి ద్వారానే వసూలు చేస్తున్నామన్నారు. వచ్చేవారం నుంచి అన్ని సచివాలయాల్లో డబ్బులు చెల్లించిన వారి పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారన్నారు. ఈనెల 21 నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ డీఈ. సత్యనారాయణ, ఏఈ రవికుమార్‌, కార్యదర్శి అనిత, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు శరత్‌బాబు, శ్రీనువాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:34:02+05:30 IST