హైదరాబాద్‌లో 9 ఆర్టీసీ డిపోల మూత?

ABN , First Publish Date - 2021-11-30T08:58:04+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ బస్‌ డిపోల సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధమైంది! నగరంలో క్రమంగా 9 డిపోలను మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌లో 9 ఆర్టీసీ డిపోల మూత?

  • 29 డిపోలను 20కి కుదించే యోచన!..
  •  హైదరాబాద్‌-3 డిపోలో కార్యకలాపాలు బంద్‌
  • 30 బస్సులు మియాపూర్‌ డిపోకు మళ్లింపు.. 
  • అదే దారిలో పికెట్‌, బీహెచ్‌ఈఎల్‌ డిపోలు!
  • సిబ్బంది ఇతర డిపోలకు బదిలీ.. 
  • స్థలాలు లీజుకిచ్చేందుకే తగ్గిస్తున్నారు: కార్మిక సంఘాలు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ బస్‌ డిపోల సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధమైంది! నగరంలో క్రమంగా 9 డిపోలను మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకే డిపోలను తగ్గిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. స్థలాలు లీజుకిచ్చేందుకే తగ్గిస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బస్‌భవన్‌ పక్కనే ఉన్న హైదరాబాద్‌-3 డిపోలోని 30 బస్సులను మియాపూర్‌ డిపోకు మళ్లించారు. డిపోలో పనిచేస్తున్న 135 మంది సిబ్బందిని ఇతర డిపోలకు పంపారు. మేనేజర్‌ను బస్‌భవన్‌కు బదిలీ చేశారు. ఇక పికెట్‌, బీహెచ్‌ఈఎల్‌ డిపోల్లోని బస్సులను కూడా చుట్టుపక్కల డిపోలకు తరలిస్తున్నారు. ముందుగా బస్సులు తగ్గించి, సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి ఆ డిపోలను కూడా త్వరలో ఎత్తేస్తారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌ జోన్‌లో భారీగా వస్తున్న నష్టాలను తగ్గించుకునేందుకే డిపోలను కుదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే డిపోల స్థలాలను లీజుకిచ్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 29 డిపోలను 20కి తగ్గిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 


ఆదాయం కోసం స్థలాలు లీజుకు..

గ్రేటర్‌లో ఆర్టీసీ రోజూ రూ.కోటి పైగా నష్టాలు మూటగట్టుకుంటోంది. 2019 వరకు గ్రేటర్‌ జోన్‌లో 3800 బస్సులుండేవి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అనంతరం డొక్కుగా మారాయంటూ వెయ్యి బస్సులను తొలగించడంతో ఈ సంఖ్య 2800కి పడిపోయింది. బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో డిపోల సంఖ్య తగ్గించాలని ఆర్టీసీ భావించింది. బస్సులు తక్కువగా ఉన్న డిపోలను క్రమంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గ్రేటర్‌లో ఒక్కో డిపోకు 6-8 ఎకరాలకు పైగానే స్థలాలు ఉన్నాయి. ఆయా ఖాళీ స్థలాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పట్లో గ్రేటర్‌కు కొత్త బస్సులు వచ్చే అవకాశాలు లేకపోవడంతో డిపోల సంఖ్య తగ్గించినా పెద్దగా సమస్యలుండవని చెబుతున్నారు. ఖాళీ చేసిన డిపోల స్థలాలను వాణిజ్య అవసరాలకు లీజు/అద్దె ప్రాతిపదికన ఇస్తే భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.


అమ్ముతారా..? లీజుకిస్తారా..?

గ్రేటర్‌లో తగ్గించిన బస్‌ డిపోల స్థలాలు అమ్ముతారా.. లేదంటే 30-40 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 29 డిపోలుండగా 2800 బస్సులే ఉన్నాయి. ఈ బస్సులకు 20 డిపోలు సరిపోతాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న డిపోలను గుర్తించి వాటిలో కొన్నింటిని ఎంపిక చేసి, ఆ స్థలాలను లీజు ప్రాతిపదికన ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ముషీరాబాద్‌ పరిధిలో ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాలనుకున్నా ఆ ప్రతిపాదనలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఈ సారి పక్కా ప్రణాళికలతో ఆర్టీసీ ఖాళీ స్థలాలపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకొని డిపోల సంఖ్య తగ్గిస్తున్నారని తెలుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, మెహిదీపట్నం, కంటోన్మెంట్‌, ముషీరాబాద్‌, రాజేంద్రనగర్‌, మిథాని, ఉప్పల్‌, రాణిగంజ్‌, హకీంపేట, కంటోన్మెంట్‌, కుషాయిగూడ వంటి డిపోల వద్ద ఖాళీ స్థలాలను పరిశీలించి వాటిలో ఎక్కువ ఆదాయం వచ్చే డిపోలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్‌ జోన్‌లో నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకే డిపోలను కుదించనున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు.గత కొన్నేళ్లుగా ఆర్టీసీలో కొత్త నియమకాలు లేకపోవడంతో పలు డిపోల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో డిపోలను తగ్గించుకుంటూ అక్కడి సిబ్బందిని ఇతర డిపోలకు బదిలీ చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో ఏటా రూ.350 కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయని, వీటిని తగ్గించుకుంటూ వాణిజ్య ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ అప్పులు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.


డిపోలు తగ్గిస్తే ఆర్టీసీకి నష్టం

నగరంలో డిపోలు తగ్గిస్తే ఆర్టీసీకి మరింత నష్టం జరిగే ప్రమాదముంది. డిపోలు తగ్గిస్తుండడంపై ఎన్నో అనుమానాలున్నాయి. డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ స్థలాలు లీజుకిచ్చినా అమ్మేసినట్లే భావించాల్సి వస్తుంది. ఆర్టీసీకి కొత్త ఎండీ, చైర్మన్‌లు వచ్చాక ఎన్నో మార్పులు వస్తాయని కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డిపోలు తగ్గిస్తూ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు, నాయకులు ఉండవద్దనే తీరు నడుస్తోంది.

- కె.హనుమంతు ముదిరాజ్‌, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ 



Updated Date - 2021-11-30T08:58:04+05:30 IST