తల్లికి అనారోగ్యం.. తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.. కుటుంబం కోసం ఆ 9 ఏళ్ల బాలిక ఎంత కష్టపడుతోందంటే..

ABN , First Publish Date - 2021-12-30T22:19:10+05:30 IST

తొమ్మిదేళ్ల వయసు పిల్లలు తమ చేతులతో సవ్యంగా ఆహారం కూడా తినలేరు. అలాంటిది ఆ బాలిక తన తల్లికి, తమ్ముడికి అన్నం వండి పెడుతోంది.

తల్లికి అనారోగ్యం.. తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.. కుటుంబం కోసం ఆ 9 ఏళ్ల బాలిక ఎంత కష్టపడుతోందంటే..

తొమ్మిదేళ్ల వయసు పిల్లలు తమ చేతులతో సవ్యంగా ఆహారం కూడా తినలేరు. అలాంటిది ఆ బాలిక తన తల్లికి, తమ్ముడికి అన్నం వండి పెడుతోంది. ఇంట్లో చిల్లి గవ్వ లేకపోయినా ఎలాగోలా రోజు గడుపుతోంది. తమ్ముడి చదువును పర్యవేక్షిస్తోంది. తను చదువుకుంటోంది. ఇటీవల తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆ బాలిక కుటుంబ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. దీంతో హాస్పిటల్ సిబ్బంది తమ వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.  


ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌నగరి ప్రాంతంలో నివసిస్తున్న 32 ఏళ్ల కైలా దేవి అనే మహిళ న్యూరో సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకుని భర్త ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో కైలా దేవి రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకుని పిల్లలను పోషిస్తోంది. ఇటీవల ఆమె అనారోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఇంటి బాధ్యతను తొమ్మిదేళ్ల ప్రీతి తీసుకుంది. రేషన్ షాప్ నుంచి సరుకులు తేవడం, వంట చేయడం, తమ్ముడిని రెడీ చేసి స్కూలుకు పంపడం, గిన్నెలు కడగడం, ఆ తర్వాత తను స్కూలుకు వెళ్లడం.. ఇదీ తొమ్మిదేళ్ల ప్రీతి దినచర్య. 


మూడు నెలల నుంచి ప్రీతి దిన్యచర్య ఇదే. ప్రస్తుతం ఆ చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది. వారం క్రితం కైలా దేవి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆ బాలికే ఇరుగుపొరుగు వారి సహాయంతో తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ సిబ్బందిని మంచి చేసుకుని తల్లి కోసం రక్తం, ఆర్థిక సహాయం పొందింది. అంత చిన్న వయసులో ఆ బాలిక ప్రదర్శిస్తున్న ధైర్యానికి హాస్పిటల్ సిబ్బంది ఫిదా అయ్యారు. హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆ చిన్నారికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కైలా దేవికి వైద్య సహాయం అందిస్తానని మాటిచ్చారు.   

Updated Date - 2021-12-30T22:19:10+05:30 IST