ఈ ఇళ్ల మాటేమిటి? విజయవాడలో 10వేలు..

ABN , First Publish Date - 2020-07-01T09:41:22+05:30 IST

జిల్లాలో సుమారు రెండు వేల ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటి వంక కన్నెత్తి చూడటం లేదు. పదేళ్ల క్రితం

ఈ ఇళ్ల మాటేమిటి? విజయవాడలో 10వేలు..

జిల్లావ్యాప్తంగా 90 వేల ఇళ్లు.. కట్టి వదిలేశారు


నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దితే నివాసయోగ్యమే. ఇటువంటి ఇళ్లు జిల్లాలో సుమారు 90 వేల వరకు ఉన్నాయి. ఒక్క విజయవాడ చుట్టుపక్కలే పది వేల ఇళ్లు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టడం లేదు. వీటిలో పెద్దగా గిట్టుబాటు ఉండదనో, గత ప్రభుత్వం చేపట్టినవనో.. వీటిని వదిలేసి, ఇళ్ల స్థలాల స్కీంకు తెరతీశారు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలు పాడుబడిపోతున్నాయి. అజిత్‌సింగ్‌ నగర్లో నిర్మించిన జేఎన్‌ఎన్యూఆర్‌ఎం గృహసముదాయాలే ఇందుకు నిదర్శనం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో సుమారు రెండు వేల ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వీటి వంక కన్నెత్తి చూడటం లేదు. పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య 32 ప్లాట్ల సముదాయం గల 116 జీప్లస్‌త్రీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు జరగలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. టీడీపీ హయాంలోనే నగరంలోని ఆక్రమిత ప్రాంతాల్లో ఉంటున్న వారికి వీటిలో 1248 ప్లాట్లు కేటాయించారు. ఏడాది క్రితం 2464 ప్లాట్ల నిర్మాణం పూర్తయినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కేటాయింపుల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వీటి ఊసే ఎత్తలేదు. నిర్మాణాలు పూర్తయిన ప్లాట్లను స్థానికంగా ఇళ్లు లేని పేదలకు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.


టిడ్కో భవనాల సంగతేంటీ..!

విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో ఐదేళ్ల క్రితం ఎనిమిది వేల మంది పేదల కోసం 124 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.649.45 కోట్లతో చేపట్టిన బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వం రాకతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏపీ టిడ్కో పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఈ భవనాల కోసం ఇప్పటికే వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది.  జక్కంపూడి, షాబాద, వేమవరంలో అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి.


గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది వేల మంది పేదల కోసం ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపట్టింది. కొన్ని భవనాలు తుది దశకు చేరుకోగా, కొన్నింటిని లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధం చేశారు. ఎన్నికలు రావడంతో ప్రక్రియను నిలిపివేశారు. వైసీపీ ప్రభుత్వం ఏడాది కాలంగా ఈ ఇళ ్ల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దాంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా, పూర్తయిన ఇళ్లలో బూజు పెరుగుతోంది. ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లు మొలిచాయి. టిడ్కో ఇళ్లను నిర్మించిన నిర్మాణ సంస్థకు చెందిన మెటీరియల్‌ ఎక్కడిది అక్కడే ఉంది. కొత్త ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా వెళ్లిపోయారు.


దీంతో టిడ్కో అధికారులే సెక్యూరిటీ గార్డులను కాపలా పెట్టారు. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాల పరిస్థితిని పరిశీలించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ వెళ్లినపుడు, చిందరవందరగా ఉన్న వస్తువులను సర్దుతున్న కూలీలు కనిపించారు. ఒకవైపున పేదలకు లక్షలాది ఇళ్లను నిర్మించి ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తే కనీసం ఎనిమిది వేల మందికి లబ్ధి చేకూరుతుంది. అయితే, ఆ ఇళ్లను గత ప్రభుత్వం నిర్మించిందనే ఒకే ఒక్క కారణంతో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని, ఇళ్లను నిర్లక్ష్యం చేయడం శోచనీయం.


ఒకవేళ ఇప్పటికిపుడు ఇళ్ల నిర్మాణాలను చేపడితే రెట్టింపు వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సిద్ధమైన భవనాల్లోని ప్లాట్లను పంపిణీ చేయాలనుకుంటే 3,900 మందికి ఇచ్చే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇళ్లకు విద్యుత్‌, తాగునీరు, ఇతర మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది.  

Updated Date - 2020-07-01T09:41:22+05:30 IST