9 వేలను దాటేసింది

ABN , First Publish Date - 2020-06-05T07:29:04+05:30 IST

వరుసగా ఆరు రోజుల పాటు ఆరు వేలపైగా కేసులు.. మధ్యలో ఒక్క రోజు ఏడు వేలు.. మరో నాలుగు రోజులు 8 వేలను మించి నమోదు..! గురువారం ఏకంగా 9 వేలను తాకిన వైనం..! ఇదీ దేశంలో కరోనా విజృంభణ తీవ్రత. గురువారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 9,304 మంది వైరస్‌ బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది...

9 వేలను దాటేసింది

  • దేశంలో హద్దూ అదుపూ లేని కరోనా


న్యూఢిల్లీ, చెన్నై, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): వరుసగా ఆరు రోజుల పాటు ఆరు వేలపైగా కేసులు.. మధ్యలో ఒక్క రోజు ఏడు వేలు.. మరో నాలుగు రోజులు 8 వేలను మించి నమోదు..! గురువారం ఏకంగా 9 వేలను తాకిన వైనం..! ఇదీ దేశంలో కరోనా విజృంభణ తీవ్రత. గురువారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 9,304 మంది వైరస్‌ బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఒక్క రోజు వ్యవధి కేసుల్లో ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. మరో 260 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ వివరించింది. గత శనివారం అత్యధికంగా 265 మంది చనిపోగా.. ఆ తర్వాత నమోదైన ఎక్కువ మరణాలివే. ఢిల్లీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని.. టెస్టులు తక్కువగా చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్యకర్తలూ పెద్దఎత్తున వైరస్‌ బారినపడుతున్నారని పేర్కొన్నారు. రైల్వే బోర్డు చైర్మన్‌ కార్యాలయ ఉద్యోగి సహా రైల్‌ భవన్‌లోని మరో ఉద్యోగికి కరోనా సోకింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను క్లినికల్‌ ట్రయల్స్‌లో వినియోగించేందుకు అనుమతిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీసుకున్న నిర్ణయాన్ని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ స్వాగతించారు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోణంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వ్యాఖ్యానించారు.


కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శికి పాజిటివ్‌

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ కరోనా బారినపడ్డారు. దీంతో సౌత్‌ బ్లాక్‌ రైసినా హిల్స్‌లోని ప్రధాన కార్యాలయంలో కొంతభాగాన్ని మూసివేశారు.  35 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు. సౌత్‌ బ్లాక్‌ మొదటి అంతస్తులోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ, నేవీ చీఫ్‌ కార్యాలయాలున్నాయి. జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజ్‌నాథ్‌ కార్యాలయానికి రాలేదు.


తమిళనాడు సచివాలయంలో 31 మందికి వైరస్‌

తమిళనాడు సచివాలయంలో ఐఏఎస్‌ అధికారిణి సహా 31 మందికి కరోనా సోకింది. గురువారం చెన్నైలోనే 1,072 మందికి పాజిటివ్‌ వచ్చింది. 12 మంది చనిపోయారు. డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ కరోనా బారిన పడ్డారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. కర్ణాటకలో కొత్తగా 257 మందికి పాజిటివ్‌ వచ్చింది. మహారాష్ట్రలో వైరస్‌తో మృతి చెందిన పోలీసుల సంఖ్య 30కి చేరింది.


Updated Date - 2020-06-05T07:29:04+05:30 IST