ఆ వంతెన పౌరుషానికి ప్రతీక

ABN , First Publish Date - 2021-07-29T05:18:17+05:30 IST

శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన 95 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఆ వంతెన పౌరుషానికి ప్రతీక
స్వర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన

శ్రీకాళహస్తి, జూలై 28: పౌరుషానికి ప్రతీకగా ఆ వంతెన నిర్మాణం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిపై 95 ఏళ్ల కిందట నిర్మించిన రామసేతు వంతెనపై ఇప్పటికీ రాకపోకలు సాగుతున్నాయి. పానగల్‌ సంస్థానాధీశుడు రాజా పానుగంటి రామానాయనిం నిర్మించడంతో, ఆయన పేరిట రామసేతుగా నామకరణం చేశారు. తొలుత స్వర్ణముఖి నదిలో లభ్యమైన బండరాళ్లతో నిర్మించిన కాజ్‌వే మీదుగా వేసవిలో మాత్రమే రాకపోకలు జరిగేవి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న రాజా పానుగంటి రామానాయనిం 1922, మార్చి 31న శ్రీకాళహస్తికి వచ్చారు. ఆ సమయంలో స్వర్ణముఖి కాజ్‌వే దాటేందుకు ఆయన ఇబ్బందులు పడ్డారు. దీంతో రాజా వారు కూడా కష్టసాధ్యంగా నది దాటాల్సి వచ్చిందని వెంట ఉన్న ఓ బ్రిటిష్‌ దొర ఎద్దేవా చేశారు. ఓ వంతెన నిర్మిస్తే మంచిదని ఆయన సూచించడం రాజావారికి పౌరుషం తెప్పించింది. దీంతో వచ్చే ఏడాది ఇదే తేదీ నాటికల్లా వంతెన నిర్మాణం చేపడతామని తేల్చిచెప్పారు. ఆ మేరకు మరుసటి ఏడాది అంటే... 1923, మార్చి 31న వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు అవసరమైన ముడి సామగ్రిని ఇంగ్లండ్‌ నుంచి తెప్పించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసి 1926, జనవరి 31న వంతెన ప్రారంభించారు. బలమైన పునాదులతో నిర్మించిన ఈ వంతెన 1947లో స్వర్ణముఖి నదీ ప్రవాహ ఉధ్రుతికి కుంగిపోయింది. కొన్నినెలల పాటు వంతెనపై రాకపోకలు నిలిచిపోగా, మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. తర్వాత 1976లో వంతెన పైనుంచి వరద ప్రవాహం సాగినా ఎలాంటి సమస్య తలెత్తలేదు. 2012లో వంతెన పైనున్న రోడ్డు దెబ్బతినడంతో ఆ ఏడాది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో, దీని పక్కనే కొత్తగా వంతెన నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జిపైనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే పాత వంతెనపై తేలికపాటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రామసేతు ఇప్పటికీ సేవలందించడం విశేషమే కదా. 

Updated Date - 2021-07-29T05:18:17+05:30 IST