‘గుట్ట’క్కాయ స్వాహా!

ABN , First Publish Date - 2021-08-03T07:43:19+05:30 IST

కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామానికి చెందిన ఒకాయన పీలేరుకు మకాం మార్చాడు. అక్కడ వైసీపీలో చలామణి అవుతూ ‘రియల్‌ ఎస్టేట్‌’ వరవడులను వంటబట్టించుకున్నాడు. ఓస్‌.. ఇంతే కదా అంటూ ఏకంగా స్వగ్రామానికి చెందిన 355 ఎకరాల గుట్టను చెరబట్టేందుకు పూనుకున్నాడు.

‘గుట్ట’క్కాయ స్వాహా!

 గడి వద్ద 355 ఎకరాల గుట్టను చెరబట్టారు

 కలికిరిలోనూ మొదలైన పీలేరు సంస్కృతి

 బరితెగించిన పీలేరు వైసీపీ వలస నాయకుడు


ఎకరా రెండెకరాలు కాదు.. ఏకంగా 355 ఎకరాల మట్టిగుట్ట. పేరుకు గుట్టయినా మొత్తం ఎర్రమట్టి కలసిన గుల్ల రాయితో వుంది. అన్ని విధాలా అనువుగా వుంటుందని ఉపాధి హామీ పథకంలో చెట్లు పెంచేందుకు గతంలో పెద్దఎత్తున మొక్కలు నాటారు. పీలేరు వైసీపీ నాయకుడికి దీని పైన కన్ను పడింది. ఇంకేముంది.. పొక్లైనర్లు, టిప్పర్లు పరుగులు తీశాయి. గుట్ట చదును కావడం మొదలయ్యింది. పీలేరులో రియల్‌ ఎస్టేట్‌ దందాలకు కాస్త విరామం లభించడంతో వారి చూపు ఇటు వైపు మళ్ళింది. 

కలికిరి, ఆగస్టు 2: కలికిరి మండలంలోని పల్లవోలు పంచాయతీ గడి గ్రామానికి చెందిన ఒకాయన పీలేరుకు మకాం మార్చాడు. అక్కడ వైసీపీలో చలామణి అవుతూ ‘రియల్‌ ఎస్టేట్‌’ వరవడులను వంటబట్టించుకున్నాడు. ఓస్‌.. ఇంతే కదా అంటూ ఏకంగా స్వగ్రామానికి చెందిన 355 ఎకరాల గుట్టను చెరబట్టేందుకు పూనుకున్నాడు. గడి గ్రామానికి తూర్పుగా గ్యారంపల్లె రహదారి సమీపంలో వున్న మట్టిగుట్టను చదును చేసి ఆక్రమణకు తెరదీశాడు. ఒకే సర్వే నెంబరు 493లో 355 ఎకరాల విస్తీర్ణంతో వున్న ఈ గుట్టకు పక్కనే ఆయనకు పొలం వుంది. గుట్టను చదును చేసి మొత్తం భూమిని తన పొలంలో కలుపుకోవాలన్నది ఆయన కోరిక.పీలేరులో ఆక్రమణల దందాల్లో కొద్ది రోజులుగా స్తబ్దత నెలకొనడంతో నాయకుల చూపు పక్క మండలాల మీద పడింది. వారం పది రోజులుగా గుట్టను చదును చేసే తంతు జరుగుతున్నా గ్రామ రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుక్కూర్చున్నారు. గుట్టకు సమీపంలోనే కంకర యంత్రం కూడా ఒకటుంది. దానికి కూడా సరైన అనుమతులు లేవని తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు.తాజాగా ఈ గుట్టకు సంబంధించిన ఆక్రమణల విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు తాపీగా చర్యలకు ఉపక్రమించారు. కాగా గడి గ్రామం చుట్టు పక్కల వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో కొంతమంది పేదలకుప్రభుత్వం సాగు కోసం డీకేటీ పట్టాలు జారీ చేసింది. కొంత మంది వైసీపీ నాయకులు ఈ డీకేటీ భూములను అనధికారికంగా అగ్రిమెంట్ల రూపంలో కొనుగోలు చేయడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఇలా కొనుగోలు చేసిన డీకేటీ భూములను అడ్డుగా పెట్టుకుని చుట్టూ వున్న ప్రభుత్వ భూములను కలిపేసుకుంటూ తోటలు అభివృద్ధి చేసి రూపు రేఖలు మార్చేస్తున్నారని చెబుతున్నారు. ఆ తరువాత కొద్ది కాలం తరువాత తాపీగా అనధికారికంగా కొనుగోలు చేసిన డీకేటీ భూములకు పాసు పుస్తకాలు తయారు చేయించి వాటి ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం గడి చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన వెబ్‌ ల్యాండ్‌ నమోదుపై విచారణ చేయిస్తే పెద్దఎత్తున జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఇవన్నీ గమనించిన పీలేరు వైసీపీ వలస నాయకుడు గుట్టను స్వాహా చేసేందుకు పూనుకున్నట్లు చర్చించుకుంటున్నారు.


బోర్డు నాటించాము

 ఈ గుట్టకు సంబంధించిన ఆక్రమణల విషయం మూడు రోజుల క్రితం మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే. వెంటనే వీఆర్వోను అప్రమత్తం చేసి అది ప్రభుత్వానికి చెందిన గుట్టగా బోర్డు పెట్టించాము. ఇక పొక్లైన్లతో చదును చేసిన వారి గురించి ఆరా తీస్తున్నాం. ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-రమణి, తహసీల్దారు, కలికిరి




Updated Date - 2021-08-03T07:43:19+05:30 IST