ఏషియన్‌ అమెరికన్‌ వృద్ధురాలిపై దాడి.. బైడెన్ సీరియస్ వార్నింగ్ !

ABN , First Publish Date - 2021-03-31T16:20:02+05:30 IST

అగ్రరాజ్యంలో ఏషియన్ అమెరికన్లపై దాడులు రోజు రోజకు పెచ్చుమీరుతున్నాయి.

ఏషియన్‌ అమెరికన్‌ వృద్ధురాలిపై దాడి.. బైడెన్ సీరియస్ వార్నింగ్ !

న్యూయార్క్: అగ్రరాజ్యంలో ఏషియన్ అమెరికన్లపై దాడులు రోజు రోజకు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవల అట్లాంటాలో ఏషియన్ మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడికి పాల్పడి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్న ఘటనను మరువకముందే తాజాగా న్యూయార్క్​లో 65 ఏళ్ల ఏషియన్‌ అమెరికన్‌ వృద్ధురాలిపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అనే జాలి కూడా లేకుండా కిందపడేసి పదేపదే కడుపు భాగంలో కాలితో తన్నాడు. వృద్ధురాలు దుండగుడి దెబ్బలకు తాళలేక విలవిల్లాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనను ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. 


వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. సోమవారం ఉదయం 11.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) మాన్‌హాటన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం ముందు నుంచి వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెకు ఎదురుగా వచ్చిన దుండగుడు మొదట ఆమెను ఒక్కసారిగా కాలితో తన్ని కిందపడేశాడు. ఆ తర్వాత కిందపడిపోయిన ముసలావిడ కడుపు భాగంలో పదేపదే కాలితో తన్నాడు. దీంతో ఆమె నేలపై పడి విలవిల్లాడిపోయింది. అనంతరం అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి సమయంలో దుండగుడు ఆసియాకు వ్యతిరేక నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై హేట్‌ క్రైమ్‌ టాస్క్‌ఫోర్స్‌ దర్యాప్తు చేస్తోంది.


ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ​తీవ్రంగా ఖండించారు. ఏషియన్ ​అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై జరుగుతున్న దాడులను ఇకపై చూస్తూ ఊరుకుబోమని బైడెన్​ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడులు చాలా తప్పు అని తెలిపారు. ఈ ఘటనలపై విచారణకు ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు ట్వీట్​ చేశారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని బైడెన్ తెలియజేశారు. 


ఇదిలాఉంటే.. 2020 మార్చి 19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకూ హేట్‌ క్రైమ్‌‌కు సంబంధించి మొత్తం 3,795 కేసులు నమోదైనట్లు 'స్టాప్‌ ఏషియన్‌ అమెరికన్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ హేట్‌' సంస్థ వెల్లడించింది. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్క న్యూయార్క్‌లోనే ఆసియా వాసులపై దాడుల నేపథ్యంలో 33 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 

Updated Date - 2021-03-31T16:20:02+05:30 IST