చీకటి బతుకుల్లో వెలుగు దివ్వె

ABN , First Publish Date - 2021-02-24T05:56:30+05:30 IST

కష్టాలకు కుంగిపోని ధీరవనిత, మానవీయ విలువలు వెలుగొందే సమున్నత సమాజ నిర్మాణానికి అంకితమయిన ఉదాత్తురాలు జె. ఈశ్వరీబాయి...

చీకటి బతుకుల్లో వెలుగు దివ్వె

కష్టాలకు కుంగిపోని ధీరవనిత, మానవీయ విలువలు వెలుగొందే సమున్నత సమాజ నిర్మాణానికి అంకితమయిన ఉదాత్తురాలు జె. ఈశ్వరీబాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో పాటు, హైదరాబాద్‌ ప్రాంతంలో పేదరికంతో మగ్గిపోతున్న అభాగ్యులను, అజ్ఞానం, అంటరానితనం, అవిద్య మొదలైన వాటి నుంచి విముక్తి చేసి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి సంకల్పించిన కట్ట రామక్క, బిఎస్‌ వెంకట్రావు, వాల్తాటి శేషయ్య, అరిగె రామస్వామి, భాగ్యరెడ్డివర్మ, శ్యామ్‌సుందర్‌ మొదలైన నిస్వార్థ సేవావ్రతులు ఈశ్వరీబాయి ఆలోచనలను ప్రభావితం చేశారు. మెరుగైన సమాజం కోసం స్వప్నించిన ఆమె సికింద్రాబాద్‌ ప్రాంతంలో పేదల కోసం పాఠశాలలను, చిలకలగూడ మురికివాడలో రక్షిత మంచినీటి కోసం సర్కార్‌ నల్లాలను ఏర్పాటుచేయించి వారిలో ఒకరై జీవించారు. ప్రజాజీవితంలో ఆమె చేసిన త్యాగం ఎప్పుడూ వృథా కాలేదు. దళిత మహిళగా ప్రజాక్షేత్రంలో ప్రతిక్షణం ప్రజాక్షేమాన్నే ఆమె కాంక్షించారు. అందువల్లే, 1951లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈశ్వరీబాయిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో ప్రజలను, రాజకీయాలను ప్రభావితం చేయగల ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజాభీష్టం ఈశ్వరీబాయి వైపు మొగ్గటం ఆమె నిస్వార్ధ రాజకీయ ప్రజాజీవితానికి నిదర్శనం.


సంప్రదాయం, కట్టుబాట్ల నడుమ స్త్రీలు చదువుకోవడమే అభ్యంతరకరంగా ఉన్న రోజుల్లో, ఈశ్వరీబాయి రాజకీయ ప్రస్థానానికి ఆమె కుటుంబమే అండగా నిలబడి ప్రోత్సహించింది. సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగం చేస్తున్న సోదరుడు కిషన్‌కి ట్రేడ్‌ యూనియన్లతో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల, తన వ్యూహాత్మక రాజకీయాలకు అతడు తోడు కావడం రాజకీయ రణ క్షేత్రంలో ఆమెకు పదునైన ఆయుధం లభించినట్లయింది. ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా, ప్రజాపక్షమే తన చివరి శ్వాసగా ఈశ్వరీబాయి జీవించారు. ప్రజాప్రతినిధిగా, కార్పొరేటరుగా చిలకలగూడ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుతో పాటు, ప్రధానంగా మురికివాడల అభివృద్ధికి ఆమె పారదర్శకంగా పనిచేశారు. 1967లో నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నుంచి ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ తరఫున పోటీచేసి విజయం సాధించిన తన రాజకీయ కార్యాచరణతో ప్రజల నమ్మకాన్ని విశేషంగా చూరగొన్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొద్దికాలానికే తన ప్రతిభతో వాక్చాతుర్యంతో, అన్నిటికి మించి న్యాయ సమ్మతమైన ప్రజా సమస్యలను సభ ముందు వాదించి పాలకులను ఒప్పించడంలో ఆమె ప్రదర్శించిన రాజనీతిజ్ఞత అనిర్వచనీయం. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఈశ్వరీబాయి పాలనాపరంగా చేసిన విలువైన సూచనలను ఆ తర్వాత వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు తమ విధానాలుగా అమలుచేయడాన్ని చూస్తే ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను అర్థంచేసుకోగలం. భవిష్యత్తులో హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ విస్తృతిని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన ఈశ్వరీబాయి ఆనాడే ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశారు. పేదలకు గృహనిర్మాణ విషయంలో ప్రభుత్వాలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ని సంప్రదించాలని ఆమె చేసిన సూచన మేరకే ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించే బాధ్యతను కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు పరిశ్రమల ఏర్పాటు ఒక సమగ్ర అభివృద్ధికి నమూనాగా భావించిన ఈశ్వరీబాయి, ఆధునిక వ్యవసాయ విధానాలకు, నూతనంగా నెలకొల్పే పరిశ్రమలకు తోడు, భవిషత్తులో ప్రజావసరాలకు సరిపడా విద్యుత్‌ వినియోగాన్ని పెంచాల్సిన అవసరముందని 4వ పంచవర్ష ప్రణాళిక చర్చల్లో భాగంగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ రోజు ఆమె ప్రతిపాదించిన సుపరిపాలక జనాకర్షక పథకాలనే నేడు అనేక రాజకీయ పార్టీలు, పేదలకు ఉచిత విద్యుత్‌, కుటీర పరిశ్రమలకు విద్యుత్తులో రాయితీలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అంటూ పోటీపడి తమ మ్యానిఫెస్టోలో చేర్చుతుండటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో సంక్షేమానికి ఉండే ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించాలి. ఈశ్వరీబాయి దృష్టిలో సంక్షేమం అంటే అది ప్రజాసంక్షేమమే. అందుకే సమాజంలో అట్టడుగు, బలహీనవర్గాలు, సన్నకారు చిన్నకారు రైతులకు చెందిన పిల్లల కోసం సంక్షేమహాస్టళ్లను, పాఠశాలలను ఏర్పాటు చేయడం రాజ్యవ్యవస్థ కనీస బాధ్యతగా ప్రభుత్వాన్ని ఆమె ఒప్పించారు. ఇవే నేడు తెలుగు రాష్ట్రాల్లో ‘సాంఘిక సంక్షేమ హాస్టళ్లుగా’, ‘గిరిజన హాస్టళ్లుగా’, ‘ఎస్సీ హాస్టళ్లుగా’, ‘సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలుగా’ వర్థిల్లుతున్నాయి. ఇదంతా సాంఘిక, ఆర్థిక, స్త్రీ, పురుష, అసమానతల నిర్మూలన దిశగా ఆమె వేసిన పునాది. కేవలం సామాజిక అసమానతలే కాదు, ప్రాంతాల మధ్య అసమానతలను కూడా ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల, నిర్మాణాత్మక పాత్రను ఈశ్వరీబాయి నిర్వహించారు. 


తెలంగాణ ప్రాంతంలో అనేక వెనుకబడిన ప్రాంతాలను, ముఖ్యంగా చేనేత కార్మికులను సందర్శించి అక్కడి చేతివృత్తుల వారు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసి ఈశ్వరీబాయి చలించి పోయారు. కరీంనగర్‌, సిరిసిల్ల, గద్వాల్‌ తదితర ప్రాంతాల్లో చేనేత వృత్తి కార్మికుల కష్టాలను, వాస్తవిక స్థితిగతులను అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు చేనేత వృత్తుల వెనుక ఉన్న కష్టాలను ఆమె వివరించారు. వారి ఉత్పత్తులపై అమ్మకపు సుంకాన్ని రద్దుచేయాలని దానితోపాటు చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా ఆ పరిశ్రమ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ఈశ్వరీబాయికి ఉన్న విషయ పరిజ్ఞానం ఎంతో స్పష్టతతో కూడుకున్నది. శాసనసభ జరిగినన్ని రోజులు అనేక ప్రజా సమస్యల మీద ఆమె అనర్గళంగా ప్రసంగించేవారు. భూసంస్కరణలపై సభలో జరిగిన చర్చల సందర్భంగా నిరుపేద దళితులకు 5 ఎకరాల భూమిని పంచి ఇవ్వాలని చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళారు. హైదరాబాద్‌ లాంటి మహానగరంలో పేదవాడికో ఇల్లు అనేది అసాధ్యం. ఇళ్లులేని అభాగ్యుల అవసరాలను అర్థం చేసుకున్న ఈశ్వరీబాయి ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, బంజరు భూముల్లో దళిత, పేద, పీడిత, ప్రజలకోసం ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సూచించారు. పేదలు, దళితుల పట్ల ఆమెకు ఉన్న మానవతాదృక్పథం నేడు ప్రజాజీవితంలో ఉన్న వారందరికీ ఆదర్శప్రాయం. 

కల్లోజి సుశీల్‌ కుమార్‌

సహాయ ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం

(నేడు ఈశ్వరీ బాయి 30వ వర్ధంతి)

Updated Date - 2021-02-24T05:56:30+05:30 IST