ఆఫ్ఘన్ మసీదుపై దాడి... ముగ్గురి మృతి...

ABN , First Publish Date - 2021-11-12T23:03:35+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని ఓ మసీదులో

ఆఫ్ఘన్ మసీదుపై దాడి... ముగ్గురి మృతి...

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని ఓ మసీదులో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడిలో సుమారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 


నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని స్పిన్ ఘర్ జిల్లాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు జోరందుకున్నాయి. తాలిబన్ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, శుక్రవారం ప్రార్థనల సమయంలో ఓ మసీదులో పేలుడు జరిగినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారన్నారు. 


స్థానిక ఆసుపత్రి వైద్యుడు ఒకరు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ పేలుడులో ముగ్గురు మరణించినట్లు తెలిపారు. 15 మంది గాయపడినట్లు, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అటల్ షిన్వరి అనే స్థానికుడు మాట్లాడుతూ, మసీదు లోపల అమర్చిన బాంబులు శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల ప్రాంతంలో పేలాయని చెప్పారు. మరికొందరు స్థానికులు కూడా ఇదే విధంగా చెప్పారు. ఈ సంఘటనలో ఈ మసీదు ఇమామ్ కూడా గాయపడినట్లు తెలిపారు. 


ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఖొరసాన్ 2015 నుంచి  నన్‌గర్హర్ ప్రావిన్స్‌లో కార్యకలాపాలు జరుపుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన అనేక దాడులకు బాధ్యతను ప్రకటించుకుంది. తాజా దాడికి బాధ్యతను ఏ సంస్థా ఇంకా ప్రకటించలేదు.


Updated Date - 2021-11-12T23:03:35+05:30 IST