విరిగిన కల

ABN , First Publish Date - 2020-07-07T06:03:08+05:30 IST

నువ్వొక మేఘావృతమైన ఆకాశాన్ని కలగన్నావు నల్లని మబ్బులనుంచి జారే జలధారల్ని కళ్ల ముందరి శూన్యంలోంచి ఒలక బోసావు మట్టిని ముక్కలుచేసి వినువీధుల్లో...

విరిగిన కల

నువ్వొక మేఘావృతమైన 

ఆకాశాన్ని కలగన్నావు

నల్లని మబ్బులనుంచి జారే జలధారల్ని

కళ్ల ముందరి శూన్యంలోంచి ఒలక బోసావు

మట్టిని ముక్కలుచేసి వినువీధుల్లో

తగరపు మెరుపుల్ని అంటించావు

మట్టిదేహాన్ని రహదారులుగా 

కాంక్రీటు వనాలుగా విత్తావు


ఎకరాలుగా గజాలుగా అమ్ముడైన మట్టిలో

నాగలి గొర్రు గుంటక ఇంకా

సకల వ్యవసాయ పనిముట్లను పాతిపెట్టి

ఆకాశ హర్మ్యాలకు ఎరువుగా వేశావు

లాటరీగా మారిన ఆకలి వేటలో

నిన్ను నీ ఊరిని నీ పొలాలను కోల్పోయాక

ఊరించిన రాజధాని సౌధం

హఠాత్తుగా కళ్లముందే కుప్పకూలిపోయింది


మొలకెత్తిన ఇనుపముక్కలు 

ఇంకా ఆకాశాన్ని చేరనే లేదు

విశాల రహదారుల

మధ్య దీపాలు వెలగనేలేదు

పాత ఇంటిని పీకేసి కట్టిన కొత్త యింటికి

గృహప్రవేశం చెయ్యనేలేదు


అప్పటిదాకా పచ్చబారిన మట్టి

అప్పటిదాకా అన్నమైన మట్టి

అప్పటిదాకా జీవితమైన మట్టి

గిరికీలు కొడుతూ కాళ్లముందు 

సాగిల పడింది


జెండాల ఎజండాల నేపథ్యంలో ఊరు

ఆంక్షల సంకెళ్ల మధ్య

ఊపిరికోసం అల్లాడుతోంది

ఎర్రకోటమీద ఎగరెయ్యాల్సిన

హరితవర్ణ పతాకం ఎర్రబారుతూ

పొలాల మధ్య కదలబారుతోంది


ఇప్పటికే వలసబారిన జీవితం

పోగొట్టుకోడానికేమీలేక

తన చర్మాన్నే జెండాగా ఎగరెస్తోంది

ఇనుప బూట్ల కింద నలిగిన దేహాన్ని

ఆయువుపాటగా చేసి

రేపటి తన బిడ్డలకు కొత్త చూపవుతోంది

విరిగిన కలకు అతుకులు వేసుకుంటూ

అస్తమించబోయే ఈ దినం కోసం

ఆగిపోయిన గుండెల్ని ఊతంగా చేసుకొని

రాబోయే కొత్త రోజు కోసం

ఆయుధాలకు పదునుపెడుతోంది

బండ్ల మాధవరావు

Updated Date - 2020-07-07T06:03:08+05:30 IST