జార్ఖండ్‌లో బస్సు, లారీ ఢీ... 16 మంది మృతి, 26 మందికి గాయాలు...

ABN , First Publish Date - 2022-01-05T20:27:00+05:30 IST

జార్ఖండ్‌లోని పాకూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

జార్ఖండ్‌లో బస్సు, లారీ ఢీ... 16 మంది మృతి, 26 మందికి గాయాలు...

న్యూఢిల్లీ : జార్ఖండ్‌లోని పాకూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ఓ లారీ, బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోవింద్‌పూర్-సాహెబ్‌గంజ్ రాష్ట్ర హైవేలో పాడెర్‌కోల గ్రామం వద్ద బుధవారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అమ్రపర పోలీసులు తెలిపారు. 


40 మంది ప్రయాణికులుగల బస్సు సాహిబ్ గంజ్ జిల్లాలోని బర్హర్వా నుంచి దేవ్‌గఢ్ జిల్లాలోని జైసిదికి వెళ్తోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరిందని, గాయపడినవారి సంఖ్య 26కు చేరిందని తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకూర్ సివిల్ సర్జన్ ఆర్‌డీ పాశ్వాన్ చెప్పారు. 


ఓ క్షతగాత్రుడిని రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు నివేదించినట్లు సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ అజిత్ కుమార్ తెలిపారు. గాయపడినవారిని మొదట సదర్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. 


బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడం కోసం గ్యాస్ కట్టర్లతో బస్సు బాడీని కత్తిరించవలసి వచ్చింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైనదంటే, బస్సు, లారీ ముందు భాగాలు ఒకదానికి మరొకటి అతుక్కుపోయాయి. ఈ రెండు వాహనాలు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఢీకొన్నాయి. పొగమంచు అధికంగా ఉండటంతో దారి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 


లారీలోని గ్యాస్ సిలిండర్లు పేలకపోవడం అదృష్టమనే చెప్పాలి. సిలిండర్లు పేలి ఉంటే మరణాల సంఖ్య మరింత పెరిగి ఉండేదని పోలీసులు చెప్పారు. 


ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారికి సక్రమంగా చికిత్స అందేవిధంగా చూడాలని జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. 


Updated Date - 2022-01-05T20:27:00+05:30 IST