అర్ధరాత్రి పిలల్ని ఇంట్లోనే వదిలేసి పారిపోయిన దంపతులు! ఇది వీడ్కోలు కాదు.. అని చిట్టీ రాసి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-20T01:54:31+05:30 IST

ఆ దంపతులు అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోయారు. తమ వెంట పిల్లల్ని కూడా తీసుకెళ్లలేదు. వెళుతూ వెళుతూ పిల్లల కోసం ఓ చిన్న చిట్టీ కూడా రాసిపెట్టి వెళ్లారు. ‘‘మనందరం ఏదో రోజున మళ్లీ కలుస్తాం, ఇది వీడ్కోలు కాదు.. మన ప్రయాణంలో చిన్న అంతరాయం మాత్రమే!’’ అంటూ చిట్టీలో రాసి పెట్టారు.

అర్ధరాత్రి పిలల్ని ఇంట్లోనే వదిలేసి పారిపోయిన దంపతులు! ఇది వీడ్కోలు కాదు.. అని చిట్టీ రాసి.. అసలేం జరిగిందంటే..

 ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులు అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోయారు. తమ వెంట పిల్లల్ని కూడా తీసుకెళ్లలేదు. వెళుతూ వెళుతూ పిల్లల కోసం ఓ చిన్న చిట్టీ కూడా రాసిపెట్టి వెళ్లారు. ‘‘మనందరం ఏదో రోజున మళ్లీ కలుస్తాం,  ఇది వీడ్కోలు కాదు.. మన ప్రయాణంలో చిన్న అంతరాయం మాత్రమే!’’ అంటూ చిట్టీలో రాసి పెట్టారు. అమెరికా ప్రభుత్వాన్ని మోసగించి, వేల కోట్ల కొవిడ్ నిధులను దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రిచర్డ్ అవ్యజాన్, ఆయన భార్య ఉదంతం ఇది. కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వారు ఆగస్టు నెలలో ఇంట్లోంచి పారిపోయారు. ఇప్పటికీ వారు ఎక్కడున్నారో పోలీసులకు తెలియదు. 


కొవిడ్ సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం వేల కోట్ల డాలర్ల నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో రిచర్డ్ దంపతులు ఈ పరిహారంలో కొంత మొత్తాన్ని స్వాహా చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, ట్యాక్స్ చెల్లింపుల పత్రాల సృష్టించి ఆ డబ్బును సొంతం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి గుర్తింపు కార్డుల ఆధారంగా, మరి కొన్ని సార్లు విదేశీ విద్యార్థుల గుర్తింపు కార్డులను తస్కరించి ఇలా అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ క్రమంలో కోట్లకు పడగలెత్తారు, మూడు విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేశారు. మొత్తం 20 మిలియన్ డాలర్లు దోచుకుపోయారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. విషయం కోర్టుకు చేరింది. 


ఈ క్రమంలో న్యాయస్థానం రిచర్డ్‌కు ఏకంగా 17 ఏళ్ల శిక్ష విధించింది. అతడి భార్యకు 6 ఏళ్ల జైలు శిక్ష వేసింది.  నిందితులు కోర్టులో లేకపోయినా కూడా న్యాయమూర్తి ఈ శిక్ష ఖరారు చేశారు. కాగా..  రిచర్డ్ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఒకరికి 13 ఏళ్లు, మరొకరికి 15, ఇంకొకరికి 16. వీరందరూ ప్రస్తుతం రిచర్డ్  బంధువుల సంరక్షణలో ఉన్నారు. ప్రభుత్వం తరుపున ఓ వ్యక్తి కూడా పిల్లల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే..రిచర్డ్ బంధువులు మాత్రం పిల్లలను తమ స్వదేశమైన ఆర్మేనియాకు పంపించేందుకు అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. వారి అర్జీపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ వెలువడలేదు. 

Updated Date - 2021-11-20T01:54:31+05:30 IST