బిలియన్ డాలర్ల కంపెనీ సీఈఓ.. టీకా కోసం ఉవ్విళ్లూరి..!

ABN , First Publish Date - 2021-01-27T16:45:01+05:30 IST

బిలియన్ డాలర్ల కంపెనీ సీఈఓ.. తొందరగా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన ఐడెంటిటీని మార్చుకున్నాడు.

బిలియన్ డాలర్ల కంపెనీ సీఈఓ.. టీకా కోసం ఉవ్విళ్లూరి..!

కెనడా: బిలియన్ డాలర్ల కంపెనీ సీఈఓ.. తొందరగా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన ఐడెంటిటీని మార్చుకున్నాడు. విషయం బయటపడటంతో.. చివరికి ఉద్యోగాన్ని కోల్పోయాడు. దానికి తోడు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదర్కొంటున్నాడు. ఇంతకూ ఎవరా సీఈఓ.. వ్యాక్సిన్‌ కోసం ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రపంచంలోని చాల దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. కెనడా ప్రజలకు కూడా అక్కడి ప్రభుత్వం టీకాను అందిస్తోంది. ఈ క్రమంలో బిలియన్ డాలర్ల విలువ చేసే ఓ కెనెడియన్ క్యాసినో సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న రాడ్ బేకర్.. కొవిడ్-19 నుంచి సాధ్యమైనంత త్వరగా రక్షణ పొందాలని భావించాడు. ఇందులో భాగంగా పట్టుమని 150 మంది జనాభా కూడా లేని మారుమూల ప్రాంతమైన బీవర్ క్రీక్‌కు తన భార్యతోపాటు కలిసి వెళ్లాడు. 



రాడ్ బేకర్ దంపతులు అక్కడ తమ ఐడెంటినీ మార్చుకుని.. మోటెల్(హోటల్) కార్మికులమని చెప్పి, మోడెర్నా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అనంతరం వారి స్వస్థాలానికి పయనమయ్యారు. ఈ క్రమంలో వారి బండారం బయటపడింది. రాడ్ బేకర్ దంపతులు మోటెల్ కార్మికులు కాదని స్థానిక అధికారులు గుర్తించారు. దీంతో చివరికి ఆ దంపతులు తప్పు ఒప్పుకున్నారు. వ్యాక్సిన్‌ను పొందడం కోసం మోటెల్ కార్మికులుగా అబద్ధం అడినట్టు అంగీకరించారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో రాడ్ బేకర్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాగా.. దీనిపై యుకాన్ కమ్యూనిటీ సర్వీసెస్ మంత్రి జాన్ స్ట్రైకర్ స్పందించారు. రాడ్ బేకర్ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. యుకాన్ సివిల్ ఎమర్జెన్సీ నిబంధనలను అతిక్రమించినందుకు రాడ్ బేకర్ దంపతులకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు భారీ జరిమానాను విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-01-27T16:45:01+05:30 IST