మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పు

ABN , First Publish Date - 2022-09-12T07:56:33+05:30 IST

మునుగోడురూరల్‌, సెప్టెంబరు 11: మునుగోడు ఉప ఎన్నిక తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో గొప్ప మార్పు రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగో

మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పు

డబ్బులతో గెలవాలని టీఆర్‌ఎస్‌ యత్నం: సునీల్‌ బన్సల్‌ 

రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఖాయం: రాజగోపాల్‌రెడ్డి

మునుగోడురూరల్‌, సెప్టెంబరు 11: మునుగోడు ఉప ఎన్నిక తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో గొప్ప మార్పు రాబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలో ప్రభుత్వం డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తోందని, అయినా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని.. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులు, లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం కూరుకుపోయిందని విమర్శించారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి  కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెడతానని హడావుడి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ నియంత పాలన, మునుగోడు ప్రజల మధ్య ధర్మయుద్ధమే మునుగోడు ఉప ఎన్నిక అని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షా, నడ్డా నాయకత్వంలో రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడం ఖాయమన్నారు. ఈ ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలుస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నేటి నుంచి సంజయ్‌ పాదయాత్ర..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద సంజయ్‌ పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంజయ్‌ పాదయాత్ర 10 రోజుల పాటు కొనసాగుతుందని, 22న పెద్ద అంబర్‌పేట ఔటర్‌ రింగురోడ్డు వద్ద ముగింపు సభ ఉంటుందని యాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-12T07:56:33+05:30 IST