మూలాల్ని మట్టుబెట్టాలి

ABN , First Publish Date - 2021-09-18T05:56:29+05:30 IST

చైత్ర హత్య జరిగి వారం రోజులైనా పోలీసులు హంతకుడిని పట్టుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అసమర్థతను దుయ్యబట్టారు. వారు డిమాండ్‌ చేసినట్లే మంత్రి మల్లారెడ్డి కూడా నిందితుణ్ణి ఎన్‌కౌంటర్‌ చేస్తా మని.....

మూలాల్ని మట్టుబెట్టాలి

చైత్ర హత్య జరిగి వారం రోజులైనా పోలీసులు హంతకుడిని పట్టుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అసమర్థతను దుయ్యబట్టారు. వారు డిమాండ్‌ చేసినట్లే మంత్రి మల్లారెడ్డి కూడా నిందితుణ్ణి ఎన్‌కౌంటర్‌ చేస్తా మని బహిరంగంగా ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌ అంటే హత్య అనే విషయాన్ని అధికార పార్టీ స్పష్టంగా ఒప్పుకున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్యలు చేస్తే అవి న్యాయబద్ధమవుతాయా? జరిగిన ఎన్‌కౌంటర్‌లన్నిటినీ ఆ పేరుతో జరిపిన హత్యలుగానే భావించాల్సి ఉంటుంది. 


బలమైన సాయుధ, సాంకేతిక వ్యవస్థ కలిగిన పోలీసు యంత్రాంగం వారం రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడంతో సహజంగానే ప్రజలకు ప్రభుత్వంపై ఆగ్రహం కలిగింది. వారి ఆవేశాన్ని చల్లార్చడం కోసం రాజును పట్టించిన వారికి 10లక్షల రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పోలీసులు అప్పటికే అతణ్ణి అదుపులోకి తీసుకుని హత్య చేయాలని భావించినట్టు అనిపిస్తోంది. ‘దిశ’ అత్యాచార నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపినందుకు మొన్నటి వరకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ హైదరాబాద్‌లో విచారణ జరిపింది. ఆ కమిషన ముందుకు సాక్షులను రానీయకుండా చేయడానికి బాధిత కుటుంబసభ్యులు వారిని లాడ్జిల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు, బెదిరించారు. ఈ నేపథ్యంలో తక్షణ న్యాయం కోరుతున్న ప్రజలను సంతృప్తిపరచడం కోసం ఎన్‌కౌంటర్‌ రూపంలో కాకుండా నిందితుణ్ణి ఇతరత్రా నిర్మూలించే ఉపాయాన్ని వెదకడం కోసం కాలయాపన చేసి చివరకు ఆత్మహత్య రూపంలో హత్య చేసిందేమోనని అనుమానం కలుగుతోంది.


నిందితుడు రాజును పట్టుకోవడం ప్రభుత్వానికి చాలా చిన్న పని. కానీ సమస్యకు ముగింపు కోసమే ఇప్పటివరకు వేచి చూసినట్టుగా ఉంది. దిశ ముద్దాయిలను ఎన్‌కౌంటర్‌ చేసినా, చైత్ర ఘటనలో ఆత్మహత్య పేరుతో హతమార్చినా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆగుతాయా? సమస్య మూలాల్లోకి వెళ్లడానికి ప్రభు త్వం ఎందుకు ప్రయత్నించడం లేదో అర్థం కావడం లేదు.


సమాజంలో నానాటికీ మానవ విలువలు నశించి వ్యాపార విలువలు, సంబంధాలు పెరిగిపోతున్నాయి. సామ్రాజ్యవాద సంస్కృతి దీనికి మూలమవుతోంది. చివరికి మారుమూల పల్లెలకు కూడా ఈ విష సంస్కృతి చేరుకుంది. చైత్ర కన్నా ముందు వరంగల్‌లో చిన్నారిని హత్య చేసిన ఘటనను మనం ఇంకా మరిచిపోలేదు.


నేరస్థులను ఎన్‌కౌంటర్‌ లేదా ఆత్మహత్య పేరుతో హత్య చేసినా ప్రజల డిమాండ్‌ మేరకు ఉరిశిక్షలు వేసినా ఇలాంటి నేరాలు దేశవ్యాప్తంగా ఎక్కడా ఆగడం లేదు. వాటిలో వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే. పలుచోట్ల కులపెద్దలు, మతపెద్దలు బాధిత కుటుంబాలను బెదిరించి రాజీ చేస్తున్న ఘటనలు కోకొల్లలు. కులం, మతం, ప్రాంతీయత పేరుతో దళిత ఆదివాసీ మహిళలపై అణచివేత జరగని రోజు లేదు. 2018లో కాశ్మీర్‌లో ‘కథువా’ అనే బాలికపై హత్యాచారం చేసి హత్య చేసిన వారికి మద్దతుగా ఊరేగింపులు జరిగాయి. మహారాష్ట్ర, ఖైర్లాండ్‌ లాంటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా వేలాది మంది నిలిచిన సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి అమానుష ఘటనలు జరగకుండా ఉండాలంటే, అశ్లీల సాహిత్యాన్ని, సినిమాలను, స్త్రీలను లైంగిక వస్తువులుగా చూపిస్తున్న అన్ని మాధ్యమాలను, మనిషిని మనిషిగా కాక మృగంలాగా మారుస్తున్న మద్యపానాన్ని పూర్తిగా అరికట్టాలి. ఇందుకోసం ప్రజానీకం పెద్దఎత్తున ఉద్యమాలు జరపాలి. ప్రభుత్వం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మహిళా కమిటీలను ఏర్పాటు చేసి, వాటికి క్యాబినెట్‌ స్థాయి అధికారాలు కల్పించి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి అనువైన కార్యక్రమాలు నిర్వహించాలి. పురుషులతో సమానమనే చైతన్యాన్ని సమాజంలో తీసుకురాగలిగినప్పుడే మహిళలు మనుషులుగా గుర్తింపు, గౌరవం పొందుతారు. సమస్య మూలాలను బద్దలుకొట్టే లక్ష్యంతో ప్రజలు, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఇలాంటి ఘటనలకు ముగింపు లభిస్తుంది.


ఎన్‌. నారాయణరావు ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం

Updated Date - 2021-09-18T05:56:29+05:30 IST