లంకంత ఇల్లు!

ABN , First Publish Date - 2021-06-14T09:16:30+05:30 IST

లంకంత ఇల్లు... పే.. ద్ద ఇంటి గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఈ జాతీయాన్ని వాడుతుంటాం.

లంకంత ఇల్లు!

  • ప్లాట్ల ఎంపికలో మారుతున్న ధోరణి
  • ఎక్కువ సమయం ఇంట్లో గడిపేందుకు ప్రాధాన్యం
  • విశాలమైన ఇంటి కొనుగోలుకే మొగ్గు
  • డబుల్‌ బెడ్‌రూమ్‌తో పాటు ఓ అదనపు గది
  • అది.. ఆఫీస్‌ పని, స్టడీ రూమ్‌ కోసం ప్రత్యేకం
  • హాయిగా సేదతీరేందుకు విశాలమైన బాల్కనీ 
  • కరోనా ప్రభావంతో నయా ట్రెండ్‌


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): లంకంత ఇల్లు... పే.. ద్ద ఇంటి గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఈ జాతీయాన్ని వాడుతుంటాం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాపిల్లలు, నానమ్మ, తాతయ్య ఇలా అంతా ఓకే గూటి కింద ఉండే రోజుల్లో ఈ లంకంత ఇళ్లు ఉండేవి. ఈ తరహా ఇళ్ల ట్రెండ్‌ మళ్లీ వచ్చేసినట్లే అనిపిస్తోంది. ‘మేమిద్దరం.. మాకిద్దరు’ అన్నట్లుగా ఉంటున్న చిన్న కుటుంబాల వారు కూడా కొంటేగింటే పెద్ద ఇల్లే  కొనసాలని ఆలోచిస్తున్నారు. కరోనా వైర్‌సతో ఇళ్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైరస్‌ ప్రభావంతో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటుండటంతో అందుకు అనుగుణంగానే ఇల్లు విశాలంగా ఉండాలని భావిస్తున్నారు. బెడ్‌ రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, బాత్రుమ్‌లతో పాటు మరిన్ని సౌకర్యాలు వచ్చేలా విశాలమైన ఇల్లు కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారు. వర్క్‌ఫ్రం హోం ధోరణి పెరగడంతో ఆఫీసు పని కోసం, ఆన్‌లైన్‌ క్లాసులు పెరగడంతో పిల్లల చదువుకు ఓ ప్రత్యేక గది ఉండాలని..  అలాగే ఓ మినీ థియేటర్‌, కాసేపు బయట కూర్చొని కుటుంబంతో గడిపేందుకు వీలుగా విశాలమైన బాల్కనీ ఉండేలా ఇంటిని ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో వినియోగదారుల అభిరుచులకనుగుణంగానే సరికొత్త ట్రెండ్‌ను డెవలపర్లు, బిల్డర్లు సైతం ఫాలో అవుతున్నారు.


ఇళ్ల పరంగా హైదరాబాద్‌లో ఎక్కువ  క్రయవిక్రయాలు జరిగేవి ఫ్లాట్లే.  తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివసించడానికి అనువుగా వివిధ ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. ఈ బహుళ అంతస్తుల నివాస సముదాయాల్లో ఎక్కువగా డబుల్‌ బెడ్‌ రూమ్‌, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌, ఫోర్‌ బెడ్‌ రూమ్‌లుంటాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌లు 850 చదరపు అడుగుల నుంచి 1300 చదరపు అడుగుల వరకు ఉండగా, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లు 1500 చదరపు అడుగుల నుంచి 2000 చదరపు అడుగులతో ఉంటాయి. ఇటీవల కాలంలో డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లను కొనుగోలు చేయడానికి వచ్చేవారంతా ఎక్కువ విస్తీర్ణానికే ప్రాధాన్యమిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం కొనాలనుకునే వారు 1400 చదరపు అడుగుల నుంచి 1550 చదరపు అడుగుల మధ్య ఉండే ఫ్లాట్‌ను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఆ మేరకు డబుల్‌ బెడ్‌ రూమ్‌, హాల్‌, కిచెన్‌, బాత్రుమ్‌లతో పాటు మరో అదనపు గది (స్టడీ లేదా ఆఫీసు వర్క్‌కు), విశాలమైన బాల్కనీ వచ్చేలా చూసుకుంటున్నారు. మినీ థియేటర్‌ మాదిరిస్థాయిలో హాల్‌ పెద్దగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. 


ఈ తరహా ప్రాజెక్టులకు ప్లాన్లు

అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిలో ఎక్కువమంది విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మాదాపూర్‌లోని ఓ డెవలపర్‌ తెలిపారు. నగరంలో ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టేందుకు పలువురు డెవలపర్లు ప్లాన్లు చేసుకుంటున్నారని చెప్పారు. కొండాపూర్‌, లింగంపల్లి ప్రాంతంలో తాము విశాలమైన 2బీహెచ్‌కే రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు ప్లాన్‌లు రూపొందించగా, అందులో ప్రత్యేకంగా ఓ గది సైతం ఉండేలా చేస్తున్నామని ఓ ఆర్కిటెక్చర్‌ తెలిపారు. కాగా ఈ డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లతో పాటు అదనపు గది ఉండేవిధంగా నివాస ప్రాజెక్టు కోసం శివారు ప్రాంతాలకు ఇప్పటి వరకు దరఖాస్తులు రాలేదని, నగరంలో వివిధ ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు వస్తున్నాయని హెచ్‌ఎండీఏకు చెందిన ఓ ప్లానింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు.


విశాలమైన ఫ్లాట్లకే ఆసక్తి 

కొవిడ్‌-19తో ఇంటికే పరిమితమైనవారు ఇళ్లు ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. దాంతో విశాలమైన ఫ్లాట్‌ కానీ, ఇంటి కోసం అధిక ప్రాఽధాన్యమిస్తున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌తో పాటు హోమ్‌ థియేటర్‌ కానీ, ప్రత్యేక జిమ్‌ ఏరియా కానీ, సేద తీరడానికి అనువైన స్థలం కానీ కోరుకుంటున్నారు. దీంతో నిర్మాణ రంగలో అందుకనుగుణంగా మార్పులు వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. క్రయ, విక్రయాల జోరు పెరుగుతోంది. 

- తెలంగాణ బిల్డర్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సీ.ప్రభాకర్‌

Updated Date - 2021-06-14T09:16:30+05:30 IST