హాలీవుడ్‌ సినిమాలపై ఓ క్లాసిక్‌ ‘డైరీ’!

ABN , First Publish Date - 2021-01-03T05:30:00+05:30 IST

కరోనా వ్యాప్తి కారణంగా ఓటీటీలు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. కేవలం భారతీయ భాషల్లో సినిమాలు మాత్రమే కాకుండా-

హాలీవుడ్‌ సినిమాలపై ఓ క్లాసిక్‌ ‘డైరీ’!

కరోనా వ్యాప్తి కారణంగా ఓటీటీలు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. కేవలం భారతీయ భాషల్లో సినిమాలు మాత్రమే కాకుండా- ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని చూసే ప్రేక్షకులు కూడా పెరిగారు. అలాగే ఇంగ్లీష్‌ మూవీలు ప్రసారం చేసే టీవీ ఛానెల్స్‌, యూట్యూబ్‌ లాంటి మాధ్యమాల ద్వారా పాత హాలీవుడ్‌ సినిమాలను చూసే అవకాశం కూడా పెరిగింది.


అయితే వేల సినిమాల్లో  క్లాసిక్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? చాలా మంది ప్రేక్షకులకు ఎదురయ్యే సమస్య ఇది. ఒక వేళ కొన్ని సినిమాలను చూడటానికి ఎంపిక చేసుకున్నా- ఇంగ్లీషులో ఉండే డైలాగ్‌లు, కథాగమనం పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అలాంటి ఇబ్బందిని తొలగించడానికి శ్రీదేవీ మురళీధర్‌ చేసిన ప్రయత్నం ‘నా హాలీవుడ్‌ డైరీ’ (హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రాల సమీక్షణం).



పాతదనం ఒక ప్రమాణమే తప్ప ప్రతి పాత సినిమా ‘క్లాసిక్‌’ కాదనీ, శాశ్వతమైన విలువలు, కాల పరీక్షను తట్టుకొనే సత్తా ‘క్లాసిక్‌’గా ఒక చిత్రం నిలవడానికి గీటురాళన్నది రచయిత్రి అభిప్రాయం. ఆ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని, 1921 నుంచి 2013 వరకూ వచ్చిన విడుదలైన వాటిలో 55 చిత్రాలను ఎంచుకొని, వాటి వివరాలనూ, వాటిని ఎందుకు ‘క్లాసిక్స్‌’గా పరిగణించాలనే విశ్లేషణనూ ఈ పుస్తకంలో అందించారు.


చార్లీ చాప్లిన్‌ స్వీయ విషాదం నుంచి పుట్టిన మూకీ చిత్రం ‘ది కిడ్‌’ (1921) నుంచి ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ రూపొందించిన సంచలనాత్మక థ్రిల్లర్‌ ‘సైకో’ (1960) వరకూ... వేటికవే తమదైన వైవిధ్యం కలిగిన చిత్రాల కథా కథనాలనూ, ఆ చిత్ర నిర్మాణ నేపథ్యాలనూ, అవి రేకెత్తించిన సంచలనాలనూ శ్రీదేవీ మురళీధర్‌ సమగ్రంగా వివరించారు.


 ‘బెన్‌హర్‌’ (1959), ‘రోమన్‌ హాలిడే’ (1953) లాంటి విశ్వవిఖ్యాతమైన చిత్రాలతోపాటు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కొన్ని అరుదైన ‘క్లాసిక్స్‌’ను కూడా పరిచయం చేశారు. వీటిలో కొన్ని సినిమాల ప్రభావం ఇతర భాషా చిత్రాల మీద కూడా ఉంది. ఉదాహరణకు 1964లో విడుదలైన ఎన్టీఆర్‌ సినిమా ‘దాగుడుమూతలు’కు ‘మిస్టర్‌ డీడ్స్‌ గోస్‌ టూ టౌన్‌’ (1936) స్ఫూర్తి.


 హాలీవుడ్‌ చిత్రాల గురించి తెలుసుకోవాలనుకొనే వారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. ‘నా హాలీవుడ్‌ డైరీ’లో ఇది మొదటిభాగం. తదుపరి భాగంలో మరిన్ని గొప్ప ‘క్లాసిక్స్‌’ విశేషాలు, విశ్లేషణలు శ్రీదేవీ మురళీధర్‌ ‘డైరీ’ నుంచి వస్తాయని ఆశించవచ్చు.


‘నా హాలీవుడ్‌ డైరీ’ 

(హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రాల సమీక్షణం) మొదటి భాగం

రచయిత్రి: శ్రీదేవీ మురళీధర్‌

ప్రతులకు: 9908132166

పేజీలు: 364, వెల: రూ. 550


Updated Date - 2021-01-03T05:30:00+05:30 IST