కేరళలో రెండ్రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-07-30T06:34:26+05:30 IST

వరుసగా మూడో రోజు 22 వేలకు పైగా కరోనా కేసులు.. రాజధాని

కేరళలో రెండ్రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌

  • రేపు, ఎల్లుండి అమలు 
  • కేసుల పెరుగుదలతో ప్రభుత్వ నిర్ణయం
  • వరుసగా మూడో రోజూ 22వేల పాజిటివ్‌లు
  • కేరళకు ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం
  • కర్ణాటక కేసులు ఒక్క రోజులో 34% జంప్‌

 న్యూఢిల్లీ, తిరువనంతపురం, జూలై 28: వరుసగా మూడో రోజు 22 వేలకు పైగా కరోనా కేసులు.. రాజధాని తిరువనంతపురం సహా పది జిల్లాల్లో వైరస్‌ తీవ్రత.. ఎనిమిది వారాలుగా పదిపైనే పాజిటివ్‌ రేటు.. టెస్టులు 13 శాతం తగ్గినా అధికంగానే కేసులు నమోదు.. రోజువారీ పాజిటివ్‌లలో 13 శాతం పెరుగుదల.. దేశంలో 4 లక్షల యాక్టివ్‌ కేసులుంటే అందులో లక్షన్నర (37.1 శాతం) అక్కడే..! కేరళలో ఇదీ ప్రస్తుతం పరిస్థితి. ఈ నేపథ్యంలో జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ ఉధృతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపనుంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ ఎస్‌కే సింగ్‌ ఆధ్వర్యంలోని ఈ బృందం శుక్రవారం కేరళకు వెళ్లనుంది. స్థానిక ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగంతో కలిసి పరిస్థితిని సమీక్షించనుంది.  



ఇది థర్డ్‌ వేవ్‌ ముందస్తు పరిస్థితి?

కేరళలోని ఈ పరిస్థితిని కరోనా థర్డ్‌వేవ్‌ సూచికగా నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో ఆగస్టు మొదటి వారంలో థర్డ్‌ వేవ్‌ ప్రారంభం కానుందని గతంలో తాము వేసిన అంచనాకు ఇది దగ్గరగా ఉందని చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీరును తెలిపే ఆర్‌ వ్యాల్యూ కేరళలో క్రమంగా పెరుగుండటంతో మళ్లీ కొవిడ్‌ పడగ విప్పుతోందా?అనే ఆందోళన కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో ఆర్‌ వ్యాల్యూ దగ్గరదగ్గరగా 1.11 ఉంది. ఆర్‌ వ్యాల్యూ 1 కంటే అధికంగా ఉంటే దశలవారీగా బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని అంటు వ్యాధి దశగా పేర్కొంటారు.


కాగా, కర్ణాటకలో ఒక్క రోజే కేసులు 34 శాతం పెరిగాయి. బుధవారం 1,531 మందికి వైరస్‌ నిర్ధారణ అయితే, గురువారం 2,052 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో పది రోజుల క్రితమే సినిమా థియేటర్లకు అనుమతిచ్చారు. ఈ నెల నుంచి 26 కళాశాలలనూ తెరిచారు. మరోవైపు మహారాష్ట్రలో గత 15 రోజుల్లో 613 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా 8-10 తరగతులకు చెందినవారు. ఇక రెండో రోజు దేశంలో యాక్టివ్‌ కేసులు పెరిగాయి. బుధవారం కొత్తగా 43,509 కేసులు నమోదవగా.. 640 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 4.03 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.


కాగా, జనవరి 12 నుంచి ఈ నెల 22 వరకు విదేశాలకు 6.4 కోట్ల టీకాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. టీకా రెండు డోసులు తీసుకున్న అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌  దేశాల పౌరులకు క్వారంటైన్‌ నుంచి  మినహాయింపు ఇస్తూ ఇంగ్లాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. 



కొవాగ్జిన్లు వద్దు: బ్రెజిల్‌

హైదరాబాద్‌, జూలై 29: అత్యవసర వినియోగం కోసం తమ దేశంలో భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ను రద్దు చేసిన బ్రెజిల్‌.. తాజాగా ఆ టీకాల దిగుమతిని కూడా రద్దు చేసింది. 40 లక్షల కొవాగ్జిన్‌ డోసులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవడానికి బ్రెజిల్‌ ఇంతకుముందు భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. వ్యాక్సిన్ల దిగుమతి కోసం ఆ దేశ భాగస్వాములతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని భారత్‌ బయోటెక్‌.. ఆ దేశ ప్రభుత్వానికి తెలిపిన తర్వాత బ్రెజిల్‌కు చెందిన జాతీయ ఆరోగ్య నిఘా ఏజెన్సీ ‘అన్వీసా’ తాజాగా ఈ ప్రకటనను విడుదల చేసింది.


Updated Date - 2021-07-30T06:34:26+05:30 IST