Interpol ప్రెసిడెంట్‌గా నియమితుడైన వివాదాస్పద జనరల్

ABN , First Publish Date - 2021-11-25T20:53:59+05:30 IST

అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ ప్రెసిడెంట్‌గా

Interpol ప్రెసిడెంట్‌గా నియమితుడైన వివాదాస్పద జనరల్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ ప్రెసిడెంట్‌గా అత్యంత వివాదాస్పద జనరల్‌ నియమితుడయ్యారు. మానవ హక్కుల సంస్థలు, యూరోపియన్ పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రతా దళాల చీఫ్ అహ్మద్ నాసిర్ అల్-రైసీని ఈ పదవికి ఎంపిక చేసింది. ఆయన పదవీ కాలం నాలుగేళ్ళు. 


‘‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అహ్మద్ నాసిర్ అల్-రైసీ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు (నాలుగేళ్ళ పదవీ కాలం)’’ అని ఇంటర్‌పోల్ గురువారం ట్వీట్ చేసింది. ఆయన చాలా వరకు ఇంటర్‌పోల్ ప్రాతినిథ్య పాత్రను, స్వచ్ఛందంగా పోషిస్తారని తెలుస్తోంది. ఇంటర్‌పోల్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ జెయెర్గెన్ స్టాక్‌ పదవీ కాలాన్ని 2019లో రెండోసారి మరో ఐదేళ్ళపాటు పొడిగించింది. ఈ సంస్థ రోజువారీ కార్యకలాపాలను సెక్రటరీ జనరల్ నిర్వహిస్తారు. 


ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని లియాన్‌ నగరంలో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అహ్మద్ నాసిర్ అల్-రైసీని ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఆ సంస్థకు పెద్ద ఎత్తున యూఏఈ నుంచి నిధులు అందుతున్నాయి. యూఏఈ తన రాజకీయ అసమ్మతివాదులను అణచివేసేందుకు ఇంటర్‌పోల్‌ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 


ఇటీవల జనరల్ రైసీపై ఫ్రాన్స్, టర్కీలలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయన మానవ హక్కులను గౌరవించడం లేదని, విమర్శకులపై వేధింపులు, హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. రైసీని ఇంటర్‌పోల్ ప్రెసిడెంట్‌గా నియమించడం వల్ల కలిగే ప్రభావంపై హెచ్చరిస్తూ నవంబరు 11న ముగ్గురు యూరోపియన్ పార్లమెంటు సభ్యులు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లెయెన్‌కు లేఖ రాశారు. సంస్థ లక్ష్యం, ప్రతిష్ఠ ఆయన నియామకం వల్ల దెబ్బతింటాయని తెలిపారు. సంస్థ సమర్థవంతంగా పని చేసే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. 


2020 అక్టోబరులో దాదాపు 19 ఎన్‌జీవోలు కూడా జనరల్ రైసీని ఇంటర్‌పోల్ ప్రెసిడెంట్‌గా నియమించవద్దని కోరాయి. వీటిలో హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా ఉంది. శాంతియుతంగా విమర్శించేవారిని పద్ధతి ప్రకారం టార్గెట్ చేసే భద్రతా వ్యవస్థలో ఆయన ఓ భాగమని ఆరోపించాయి. 


Updated Date - 2021-11-25T20:53:59+05:30 IST