ఇక మావల్లకాదు !

ABN , First Publish Date - 2020-08-04T10:11:16+05:30 IST

అసలే అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న భద్రాచలం ఏరియా వైద్యశాలలో కరోనా విజృంభణతో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిపై పనిభారం భారీగా

ఇక మావల్లకాదు !

భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత

పనిభారం తట్టుకోలేక పోతున్న సిబ్బంది

రాజీనామా సమర్పించిన ఓ కాంట్రాక్టు వైద్యుడు?


భద్రాచలం, ఆగస్టు 3: అసలే అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న భద్రాచలం ఏరియా వైద్యశాలలో కరోనా విజృంభణతో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిపై పనిభారం భారీగా పెరుగుతోంది. దాంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది పేరుకు 200 పడకల ఆసుపత్రి అయినా ఆ స్థాయిలో సిబ్బంది మాత్రం ఇక్కడ లేరు. ప్రస్తుతం భద్రాచలం ఏజెన్సీ నలుమూలల నుంచి రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారు. దాంతో అంచనాలను మించి సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా కరోనా పరీక్షలకు వచ్చే వారి సంఖ్య, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య అధికారులు, సిబ్బందిలో ఆందోళన అధికమవుతోంది. ఇప్పటికే ఆసుపత్రిలో ఒక వైద్యురాలితో పాటు ఆరుగురు సిబ్బంది కొవిడ్‌ భారినపడ్డారు. 


 ముగ్గురు చేసే పనిని ఒక వైద్యుడే చేస్తుండటంతో ఒత్తిడి ని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్‌ ప్రత్యామ్నాయంపై దృష్టిసారించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇక్కడ వైద్యులు, సిబ్బంది డబుల్‌ డ్యూటీలు చేస్తూ సెలవులు సైతం లేకపోవడంతో అలసటకు గురవుతున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి తట్టుకోలేక ఓ కాంట్రాక్టు వైద్యుడు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు రాజీనామ లేఖను అందించినట్లు సమాచారం. అయితే ఆయన  రాజీనామాను ఆమోదించకుండా విధుల్లో కొనసాగాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-08-04T10:11:16+05:30 IST