వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

ABN , First Publish Date - 2022-09-28T05:52:59+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

- విద్యా వలంటీర్ల నియకాలు రద్దు

- కనీస వసతులూ కరువు

- సమస్యల్లో ప్రభుత్వ పాఠశాలలు

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 27: ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. జిల్లాలో 651 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా దాదాపు 370కిపైగా పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. దీనికితోడుగా కొంత మంది ఉపాధ్యాయులు అక్రమ డిప్యూటేషన్లతో జిల్లా విద్యాశాఖ సేవలకు అంకితం కావడంతో విద్యా బోధనపై తీవ్ర ప్రభావం పడుతున్నది. 

జిల్లాలో వందల సంఖ్యలో ఖాళీలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 23 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2016లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీచేసి 2017లో నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ నిర్వహించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉపాధ్యాయ నియమకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. దీంతో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారులను నియమించకుండా గెజిటెడ్‌ హెడ్మాస్టర్లకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఒక్కో ఎంఈవోకు నాలుగైదు మండలాల బాధ్యతలను అప్పగించారు. దీంతో వారు ఆయన తమ హెడ్మాస్టర్‌ విధులు, ఎంఈవో బాధ్యతలపై పూర్తిగా దృష్టిసారించలేక పోతున్నారు. పాఠశాలల్లో పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. 

సర్దుబాటు ఊసే లేదు

ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కొరత ఉండగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండగా వారికి సరిపడా ఉపాధ్యాయులు లేరు. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులున్నా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో నిబంధనల మేరకు విద్యార్థులు లేని పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అదే మండలంలో ఎక్కువగా విద్యార్థులుండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తే ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. ఉపాధ్యాయుల సర్దుబాటు దాదాపుగా అన్ని జిల్లాల్లో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే చేపట్టగా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా సర్దుబాటు చేయలేదు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో వారికి, ఆయా ఎంఈవోలకు మాత్రమే తెలుసునని, నిబంధనల మేరకు ఎందుకు సర్దుబాటు చేయడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 

పక్క జిల్లాల నుంచీ డిప్యుటేషన్లు

ఏ మండలంలో పనిచేసే ఉపాధ్యాయులకు అదే మండలంలోనే డిప్యూటేషన్‌ ఇవ్వాల్సి ఉండగా మండలం కాదు... ఏకంగా జిల్లా దాటి పెద్దపల్లి నుంచి కూడా కొంత మంది ఉపాధ్యాయులు కరీంనగర్‌ జిల్లాలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయుల కొరతను తగ్గించేందుకు విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో గత సంవత్సరం వరకు విద్యా వలంటీర్లుగా పనిచేసిన వారిని కూడా ఈయేడు తిరిగి విధుల్లోకి తీసుకోక పోవడంతో విద్యాబోధనపై మరింత భారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలో భార్యాభర్తలు ప్రభుత్వోద్యోగులైతే వారిని స్పౌస్‌ కోటాలో బదిలీ చేయగా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం  జరుగలేదు. దీంతో భార్య ఒకచోట, భర్త మరోచోట ఉద్యోగాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. 

పెరగని విద్యార్థుల సంఖ్య

ఇక ప్రభుత్వం మన ఊరు...మన బడి.... మన బస్తీ...మన బడి కార్యక్రమంలో దశలవారిగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికి జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో కూడా ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులు పూర్తికాలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. చివరకు స్కావెంజర్లను కూడా నియమించలేదు. ఓవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యా వలంటీర్లనూ నియమించకపోవడం, కనీస వసతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు.  

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు...:

-కోహెడ చంద్రమౌళి, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి  

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  ఈసారి విద్యా వలంటీర్లనూ నియమించలేదు. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, పదిహేడేళ్లుగా పర్యవేక్షణ అధికారులు లేక విద్యాశాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి  సమస్యలను పరిష్కరించాలి.

Updated Date - 2022-09-28T05:52:59+05:30 IST