ఒగ్గు సంప్రదాయంపై సాంస్కృతిక దాడి

ABN , First Publish Date - 2022-01-22T07:44:56+05:30 IST

కొమురవెల్లి దేవస్థానంలో బహుజన సంస్కృతికి నిలువెత్తు

ఒగ్గు సంప్రదాయంపై సాంస్కృతిక దాడి

  • పూజారులను అవమానించేలా టికెట్లపై ముద్రణ..
  • రాష్ట్ర ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం ఆగ్రహం
  •  దేవాదాయ శాఖ కార్యాలయం ముట్టడి


మంగళ్‌హాట్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి దేవస్థానంలో బహుజన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా విలసిల్లుతున్న ఒగ్గు సంప్రదాయంపై సాంస్కృతిక దాడి మొదలైందని తెలంగాణ ఒగ్గు, బీర్ల పూజారులు, కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడం, టికెట్లపై వారిని అవమానించేలా ముద్రలు వేయడాన్ని నిరసిస్తూ ఒగ్గు పూజారులు శుక్రవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన ద్వారం ముందు పసుపుతో ముగ్గువేసి ఒగ్గు క థ చెబుతూ నిరసన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ధర్మయ్య, రవి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలగించడం అన్యాయమని అన్నారు. స్వామివారి మే లుకొలుపు, పవళింపు సేవ ఒగ్గు పూజారులతో మూలవిరాట్‌ మల్లన్న స్వామి దగ్గర నిలబడి చేయించడం ఆనవాయితీగా వ స్తున్న ఆచారమని, ప్రస్తుతం తమను దేవస్థానం అధికారులు ఆలయం బయట నుంచి మైక్‌లో కథ చెప్పించడం దారుణమన్నారు. ‘‘ఒగ్గు సంప్రదాయం ప్రకారం జరగాల్సిన మల్లన్న లగ్గా న్ని శిష్ట ఆగమశాస్త్ర పద్ధతిలో జరపడం సరికాదు. మల్లన్న బం డారు (పసుపు) ప్రియుడు. బండారు పూజలకు బదులుగా అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు నిర్వహిస్తున్నారు.


భక్తులకు అందజేసే పట్నం టికెట్లపై, ఆలయ గోడలపై ఒగ్గు పూజారులకు డబ్బులు ఇవ్వకూడదని అచ్చువేయించడం మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమే. స్థల పురాణం, మల్ల న్న జీవితచరిత్రను పూర్తిగా మార్చేసే కుట్ర జరగుతోంది. దేవాదాయ శాఖ ని యామకాలలో ఒగ్గు సంప్రదాయాన్ని ప క్కన పెట్టి ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులుగా నియామాకాలు జరపడం సరికాదు’’ అని ధర్మయ్య, రవి పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న  కళాకారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌  బాలాజీతో చర్చలు జరిపారు. డిమాండ్లలో నాలుగింటిని పది రోజుల్లో పరిష్కరిస్తామని, మిగిలిన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఒగ్గు కళాకారులు శాంతించారు. 


Updated Date - 2022-01-22T07:44:56+05:30 IST