విభిన్న నేత

ABN , First Publish Date - 2021-09-03T06:30:14+05:30 IST

కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ తొమ్మిదిపదులు దాటిన వయసులో బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంవల్ల ఆయన గత కొన్నేళ్ళుగా క్రియాశీల కార్యక్రమాలకు దూరంగానే...

విభిన్న నేత

కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ తొమ్మిదిపదులు దాటిన వయసులో బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంవల్ల ఆయన గత కొన్నేళ్ళుగా క్రియాశీల కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. హురియత్‌ కాన్ఫరెన్సు వ్యవస్థాపకుల్లో ఒకరిగా, దానికి మూడుదశాబ్దాలపాటు అందించిన నాయకత్వానికి కూడా ఆయన గత ఏడాది జూలైలోనే స్వస్తిచెప్పారు. ఈ పాకిస్థాన్‌ అనుకూల నాయకుడి కన్నుమూత ఇప్పుడు క్షేత్రస్థాయిలో విశేషప్రభావం చూపే అవకాశాలు లేకపోవచ్చు కానీ, కశ్మీర్‌ చరిత్రలో ఆయన పాత్ర, ప్రస్థానం కాదనలేనివి. 


ఆయన కన్నుమూసిన కొద్దిక్షణాల్లోనే లోయలో భద్రత చర్యలు బలోపేతమయ్యాయి, మరిన్ని బలగాలు మోహరించాయి. మొబైల్‌ఫోన్లు ఆగిపోయాయి, ఇంటర్నెట్‌సేవలు నిలిచిపోయాయి. అంత్యక్రియలు కూడా హడావుడిగా, పోలీసు నిర్బంధం మధ్యన, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిపోయాయి. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు కాన్సర్‌ సర్జరీతో పాటు ఏడుసార్లు శస్త్రచికిత్సలు జరిగినందున సామాజిక మాధ్యమాల్లో తరచుగా ఆయన మరణవార్త ప్రచారం అవుతూ,బలగాలు అప్రమత్తం కావడం కొంతకాలంగా జరుగుతున్నదే. కశ్మీర్‌ వేర్పాటువాద నేతల్లో ఈయన మరీ మొండిఘటం, పూర్తిభిన్నం కనుక, ఆయన పాక్‌ పక్షపాతం దృష్ట్యాకూడా ముప్పయ్యేళ్ళకాలంలో కనీసం డజను హత్యాయత్నాలు జరిగాయని కూడా సన్నిహితులు సగర్వంగా చెప్పుకుంటారు. స్కూలు మేష్టరు స్థాయినుంచి రాజకీయనాయకుడిగా, ఒక ఇస్లామిక్‌ పార్టీ వ్యవస్థాపకుడిగా, వేర్పాటువాద నాయకుడిగా ఆయన ప్రస్థానం చిత్రమైనది. అరవయ్యోదశకంలోనైతే ఆయన ఏకబిగిన అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ తరువాత కూడా తరచు జైల్లోనో, ఎక్కువకాలం గృహనిర్బంధంలోనో గడిపారు. తీవ్రవాదం నుంచి వీధిపోరాటాల వరకూ దేనినైనా ప్రభావితం చేయగలిగే శక్తి ఆయనది. ఆయన సిద్ధాంతరాద్ధాంతాలను అటుంచితే, ఆయన ప్రతీ మాట ప్రజలకు స్ఫూర్తినిచ్చేది, కొత్తశక్తిని నింపేది. తమ ఆకాంక్షలకు ప్రతినిధిగా ఆయన ప్రజలకు కనిపించేవారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే విషయంలో మరో వేర్పాటువాద నాయకుడు సజ్జాద్‌లోన్‌తో విభేదించి హురియత్‌ను చీల్చిన తరువాత గిలానీ యువతరం దృష్టిలో మరింత నమ్మకమైన వేర్పాటువాద నాయకుడిగా అవతరించాడు. అంతకుముందు జమాత్‌ ఇ ఇస్లామీ ముఖ్య నేతగా, 1987 ఎన్నికల్లో రిగ్గింగ్‌ కనుక జరగనట్టయితే ఆ పార్టీని ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌లో భాగంగా అధికారంలోకి కూడా తేగలిగేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మతం కంటే, పార్టీ కంటే ఆయన సమ్మోహనశక్తి ప్రజలను ప్రభావితం చేసేది. అంతిమంగా ప్రజలతో ‘గిలానీవాలీ ఆజాదీ’ అని రోడ్లమీద నినదించేట్టు చేశాడాయన. హురియత్‌తో చర్చల విషయంలో న్యూఢిల్లీ అంతర్గత కుట్రలకు పాల్పడుతున్నదనీ, కశ్మీర్‌పై పాకిస్థాన్‌ కూడా తగినంత శ్రద్ధ పెట్టడం లేదనేవారు గిలానీ. ఆ దేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా పర్వేజ్‌ ముషార్రఫ్‌ ఓ మెట్టుదిగి నాలుగుపాయింట్ల విధానాన్ని ప్రతిపాదించినప్పుడు గిలానీ తీవ్రంగా మండిపడ్డారు. 


కశ్మీర్‌లో కాలక్రమేణా వస్తున్న మార్పులను కానీ, అంతర్జాతీయంగా భారతదేశం బలపడుతున్న విషయాన్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా దశాబ్దాలపాటు గిలానీ అదే పాటపడుతూ వచ్చారన్న విమర్శ లేకపోలేదు. ఈ కారణంగా ఆయన కశ్మీర్‌కు మేలుచేయకపోగా ద్రోహం చేశారనీ, లోయను కదలనివ్వకుండా చేశారని విమర్శలున్నాయి. అసలు సిసలు కశ్మీరీయత్‌ను గాలికొదిలేసి, సంకుచిత వాదనలతో కశ్మీర్‌ను మతకోణంలో చీల్చడమే కాక, మిగతా దేశానికీ దానికీ మధ్య అగాధాన్ని పెంచి ద్రోహం చేశారని కొందరి వాదన. మూడుదశాబ్దాలపాటు లోయ రగిలిపోవడానికీ, నష్టపోవడానికీ కారకుడన్న విమర్శను అటుంచితే, దాని ప్రతీ దశలోనూ తనదంటూ ఓ ముద్రవేసిన నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ.

Updated Date - 2021-09-03T06:30:14+05:30 IST