నెరవేరనున్న దశాబ్దాల కల

ABN , First Publish Date - 2022-01-22T05:56:22+05:30 IST

పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్‌, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఇబ్బందులు త్వరలో తొలగిపోనున్నాయి.

నెరవేరనున్న దశాబ్దాల కల
కూనారం క్రాస్‌ రోడ్డులో రైలు గేట్‌ పడడంతో ఆగిన వాహనాలు (ఫైల్‌)

- పెద్దపల్లి- కూనారం రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి

- రూ. 119.5 కోట్లు మంజూరు

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం

- ఫలించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కృషి

- సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్‌, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఇబ్బందులు త్వరలో తొలగిపోనున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో దశాబ్దాల కల నెరవేరనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ 119 కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పాటు రాష్ట్రంలో మరో నాలుగు చోట్ల ఆర్‌వోబీలను మంజూరు చేశారు. సికింద్రాబాద్‌-నుంచి న్యూఢిల్లీ వరకు గల అతిపెద్ద రైల్వేలైన్‌ పెద్దపల్లిగుండా పోతున్నది. ఈ లైన్‌లో అనేక ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్‌, ప్యాసింజర్‌ రైళ్లతో పాటు గూడ్స్‌రైళ్లు నడుస్తుంటాయి. దీంతో చీటికిమాటికి గేట్లు పడుతుండడంతో పెద్దపల్లి నుంచి కాల్వశ్రీరాంపూర్‌కు వెళ్లే రహదారిలో, పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లే రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 25 ఏళ్ల క్రితం పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లేందుకు ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించడంతో ఆ దారిగుండా ప్రయాణించే వాహనదారుల కష్టాలు తీరాయి. పెద్దపల్లి పట్టణం నుంచి కాల్వశ్రీరాంపూర్‌ వెళ్లే రహదారిలో కూనారం క్రాస్‌రోడ్డులో రైలు గేట్‌ పడుతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ కల నెరవేరడం లేదు. గతంలో ఒకసారి కేంద్ర రైల్వే శాఖ ద్వారా నిధులు మంజూరైనప్పటికీ, అది కాగితాలకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఓవర్‌ బ్రిడ్జిని చేపట్టాలని నిర్ణయించి 119 కోట్ల 50 లక్షలు మంజూరు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 250 కోట్ల 2లక్షలు, కేంద్ర ప్రభుత్వ వాటా కింద 154 కోట్ల 80 లక్షల రూపాయలు భరించాల్సి ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పలుసార్లు రైల్వే జీఎంలకు విన్నవించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరుచేయడంతో ఆయన శుక్రవారం కూనారం క్రాస్‌రోడ్డులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి త్వరలోనే ఆర్‌అండ్‌బీ టెండర్లను ఆహ్వానించనున్నది. ఇక్కడ భూసేకరణ తక్కువగానే ఉంటుంది. ఇప్పటికే రాజీవ్‌ రహదారి నుంచి రైల్వేగేట్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయి నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. నిధులు ఎప్పటికప్పుడు విడుదలైతే కానీ పనులు ప్రారంభమైన నాటినుంచి ఏడాదిన్నరలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. 

వివిధ ప్రాంతాలకు పెరగనున్న రవాణా సౌకర్యం..

కూనారం రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లయితే ఈ దారి గుండా వివిధ ప్రాంతాలకు మరింత రవాణా సౌకర్యం పెరగనున్నది. సమయం కూడా ఆదా కానున్నది. రైలు గేట్‌ పడితే ఒక్కోసారి 30 నిమిషాల వరకు కూడా సమయం పడుతుంది. ఇప్పుడు ఆ కష్టాలు తీరనున్నాయి. ఈ రూటు గుండా కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ముత్తారం మండలాలతో పాటు జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాలకు మరింత అనుసంధానం పెరగనున్నది. డబుల్‌ రోడ్లు ఉన్నప్పటికీ ఇన్నాళ్లు బ్రిడ్జి లేక ఇతర ప్రాంతాల గుండా వాహనదారులు ప్రయాణం చేశారు. 

Updated Date - 2022-01-22T05:56:22+05:30 IST