తిలక్‌ను పెద్ద తత్వవేత్తగా చూపెట్టే విఫల ప్రయత్నం!

ABN , First Publish Date - 2021-06-28T06:30:59+05:30 IST

కొప్పర్తిగారి ‘బహుళ తాత్వికం తిలక్‌ కవిత్వం’ అన్న వ్యాసం (వివిధ: 14.06.21) విచిత్ర మైన ప్రతిపాదనలు చేసింది. ‘కరుణను కవిత్వానికి అంతిమ లక్ష్యంగా చెయ్యడంతో...

తిలక్‌ను పెద్ద తత్వవేత్తగా చూపెట్టే విఫల ప్రయత్నం!

కొప్పర్తిగారి ‘బహుళ తాత్వికం తిలక్‌ కవిత్వం’ అన్న వ్యాసం (వివిధ: 14.06.21) విచిత్ర మైన ప్రతిపాదనలు చేసింది. ‘కరుణను కవిత్వానికి అంతిమ లక్ష్యంగా చెయ్యడంతో అన్ని రకాల హింసను విధ్వంసాలనూ కవిత్వం ఆవరణ నుంచి నెట్టివేశాడు తిలక్‌’ అన్నారు కొప్పర్తి. ఇది విప్లవ కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్య గానే భావించాలి. శ్రీశ్రీ కాలం నాటి ఏకైక సిద్ధాంత ప్రభావం కన్నా తిలక్‌ బహుళ తాత్వికత తెలుగు కవిత్వానికి రహదారులు వేసిందని చెప్పారు. ఇంకా చాలా నర్మగర్భ వ్యాఖ్యల్లో కొప్పర్తి శ్రీశ్రీ కన్నా తిలక్‌ని తక్కువ వాడనకూడదనీ, వెనుగ్గా చూడరాదనీ, మార్క్సిస్టు సిద్ధాంతం కన్నా బహుళ తాత్వికత ప్రభావవంతమైనదనీ తీర్మానించే ప్రయత్నం చేశారు. తిలక్‌ ప్రధానంగా (రా.రా. అన్నట్టు) ‘శబ్ద శక్తి, అలంకార పుష్టి గల’ అపారమైన భావుకత కలిగిన కవి మాత్రుడు. మంచి కథలూ రాశాడు. అంతకు మించి తిలక్‌ పెద్ద తత్వవేత్త కాదు. అలా చూపెట్టే విఫల ప్రయత్నం కొప్పర్తి గారెందుకు చేశారో అంతుపట్టలేదు.


తిలక్‌ కవిత్వంలోని ఉత్తమశ్రేణి ప్రతీకలు, భాషా సామర్థ్యం, అభివ్యక్తిలోని నిరుపమానమైన సౌందర్యాత్మకత ఏ యుగం నాటి కవిత్వ ప్రేమికుడికైనా నచ్చుతాయి. ఆ నచ్చడాన్ని(?) అస్తిత్వవాద ఉద్యమాలకి తిలక్‌ మార్గం వేశాడ నేంత దూరం తీసుకురావడం వెనుక కొప్పర్తి గారి ఉద్దేశ్యాన్ని సందేహించాల్సి వస్తోంది. ఆ కోణంలో మాట్లాడితే తిలక్‌ కుదురు ముఖ్యం కాదా? అస్తిత్వవాదులెవ్వరైనా తిలక్‌ని మనసారా హత్తుకోగల సామాజిక సంఘర్షణ అతని కవిత్వంలో ఉందనుకోగలమా? ‘వర్గ పోరాట’ సందర్భంలో అస్తిత్వవాదులకున్న వైరుధ్యాల్ని, మార్క్సిస్టు చట్రానికి దూరమని చిత్రించి తద్వారా తిలక్‌ని, కొప్పర్తిగారు ఏ ప్రజా పోరాటాలకి దగ్గర చేయాలనుకుంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఏ వాదానికి చెందిన కవైనా భావజాలపరంగానే అంతర్ముఖత్వం కలిగి ఉంటాడు.


‘విశ్వనాథ వారు వెనక్కి నడవగా నడవగా వేదకాలం యింకా వెనక్కివెనక్కి పోయిందట’ అన్న తిలకే ‘మాధుర్యం, సౌందర్యం, కవితా మాద్వీక చషకంలో రంగరించి పంచిపెట్టిన ప్రాచేతస కాళిదాస కవిసమ్రాట్టులనీ, ఊహా వ్యూహోత్కర భేదనచణ ఉపనిషదర్థ మహో దధివిహిత మహిత రత్నరాశుల్నీ పోగొట్టుకునే బుద్ధిహీనుడెవరు’? అనీ అడిగాడు మరి. రష్యా దేశాన్ని కొలవలేను అన్నందుకే తిలక్‌ కవిత్వంలో దేశీయ సాంస్కృతిక సమర్థింపు ఉందనుకోలేము. అసలు శ్రీశ్రీనీ తిలక్‌నీ పక్కపక్కనపెట్టి రాయడంలో, కొత్తతరం కవుల్నీ, రచయితల్ని గందరగోళ పరిచడమే కొప్పర్తి వ్యూహంలా కనిపిస్తోంది. ఉత్తరాధునిక భావజాలాన్ని పూర్తిగా ఆలంబన చేసుకున్న వ్యాసమిది. 


ఇప్పుడు మనమున్న రాజకీయ వాతావరణ మేమిటి? కవుల్నీ, రచయితల్నీ, సృజనకారుల్నీ జైళ్ళలో మగ్గబెడుతున్న, ప్రజలపక్షాన నిలబడి పోరాడుతున్న సాహిత్య సంస్థల్ని నిషేధిస్తున్న కాలంలో కదూ నిలబడి ఉన్నాం. ఇలాంటప్పుడు చరిత్రని మన సూత్రీకరణలకనుగుణంగా అద్దం పట్టి చూపెట్టే అగత్యమెందుకు? తిలకే స్వయంగా శ్రీశ్రీని ‘మాకు చిన్నన్న’ అన్నాడు కదా. 


కొప్పర్తిగారే ప్రస్తావించినట్టు తెలుగు వచన కవిత్వ వికాసంలో తిలక్‌ నొక ‘శుద్ధ లేక స్వచ్ఛ కవిత్వవాదిగా’ గుర్తుంచుకోవల్సి వస్తే, లేక ఏ ‘పరిమిత దృష్టి నుంచి కవిత్వాన్ని విముక్తి చేసిన వాడుగానో’ చూడదలిస్తే; తిలక్‌ సమకాలికతను నిరూపించదలచిన ప్రతీ సందర్భంలో, కొప్పర్తి గారు, శ్రీశ్రీని ఉటంకించకుండా ఉండలేకపోవడం నిశిత పరిశీలనార్హమైనది మరి.

శ్రీరామ్‌

99634 82597


Updated Date - 2021-06-28T06:30:59+05:30 IST