ఆ పిల్లల దేహాలు.. ఎముకల గూళ్లు.. రెండు నెలలుగా పస్తులు.. ఎవరినీ అడగలేక..

ABN , First Publish Date - 2021-06-18T00:17:39+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఆశ్రయిస్తున్న లాక్‌డౌన్లు మిగులుస్తున్న విషాదానికి సజీవ సాక్ష్యం ఇది

ఆ పిల్లల దేహాలు.. ఎముకల గూళ్లు.. రెండు నెలలుగా పస్తులు.. ఎవరినీ అడగలేక..

కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఆశ్రయిస్తున్న లాక్‌డౌన్లు మిగులుస్తున్న విషాదానికి సజీవ సాక్ష్యం ఇది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు చెందిన పేదలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకానికి దృష్టాంతమిది. రెండు నెలలుగా పస్తులుంటున్న ఓ కుటుంబ కన్నీటి గాథ ఇది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ హాస్పిటల్‌లో చేరిన 45 ఏళ్ల మహిళ, ఆమె ఐదుగురు పిల్లల దేహాలను చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు. 


గతేడాది లాక్‌డౌన్ సమయంలో భర్తను కోల్పోయిన గుడ్డి (45).. పెద్ద కొడుకు మాసన్ (20) అరకొర సంపాదనతో కుటుంబాన్ని లాక్కొస్తోంది. ఈ ఏడాది రెండో లాక్‌డౌన్ కారణంగా మాసన్ ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. వంట చేసుకోవడానికి ఇంట్లో ఏమీ లేవు. ఇరుగు పొరుగును అడిగితే రెండు మూడ్రోజులు ఆహారం అందించారు. వారు కూడా పేదలే కావడంతో ఇంక వీరు అడగడం మానేశారు. వీరికి కనీసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లేదు. 


గ్రామ పెద్దలు, రేషన్ డీలర్ కూడా వీరికి సహాయం చేయలేదు. సర్పంచ్ కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేదు. దీంతో వీరు రెండు నెలలుగా పస్తులుంటున్నారు. పిల్లలు అత్యంత బలహీనంగా ఎముకుల గూళ్లుగా మారిపోయారు. వీరి పరిస్థితి చూసిన స్థానికులు ఎన్‌జీవో సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి చూసేటప్పటికి వీరు నడవడానికి కూడా శక్తి లేని పరిస్థితిలో ఉన్నారు. గట్టిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.


వీరిని అలీఘడ్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోషకాహారం పెడుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నారు. వీరికి తగిన సహాయం చేసేందుకు ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీవోలు ముందుకొచ్చాయి. మొబైల్ సిమ్ లేకపోవడంతో వీరికి ఆధార్ కార్డు రాలేదని, ఆధార్ కార్డు లేకపోవడం వల్ల రేషన్ కార్డు రాలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-06-18T00:17:39+05:30 IST