ట్రాక్టర్లతో కదం తొక్కిన రైతన్న

ABN , First Publish Date - 2021-01-08T07:56:28+05:30 IST

ఢిల్లీ శివార్లలో రైతన్న ట్రాక్టర్లతో కదం తొక్కాడు. వేల మంది రైతులు పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ శివార్ల నుంచి నాలుగు మార్గాల మీదుగా దాదాపు 3,500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు.

ట్రాక్టర్లతో కదం తొక్కిన రైతన్న

  • నాలుగు ప్రాంతాల నుంచి భారీ ర్యాలీలు.. శివార్లను మూసివేసి, ట్రాఫిక్‌ మళ్లింపు
  •  తబ్లీగీ లాంటి పరిస్థితులు రాకుండా చూడండి
  •  కేంద్రానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు


న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీ శివార్లలో రైతన్న ట్రాక్టర్లతో కదం తొక్కాడు. వేల మంది రైతులు పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ శివార్ల నుంచి నాలుగు మార్గాల మీదుగా దాదాపు 3,500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో 43 రోజులుగా చలి, వర్షాలను లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్లతో ఢిల్లీ ముట్టడికి నిర్వహించ తలపెట్టిన ‘కిసాన్‌ పరేడ్‌’ కార్యక్రమానికి గురువారం నాటి ట్రాక్టర్ల ర్యాలీ ఓ రిహార్సల్‌ లాంటిదని రైతు సంఘం నేతలు అభివర్ణించారు.


ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హరియాణా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  కేంద్రంతో ఇప్పటికి ఏడు సార్లు చర్చలు జరిగినా ఫలితంలేదు. భవిష్యత్‌ కార్యాచరణను అమలు చేస్తామని 40 రైతు సంఘాల నేతలు నినదించారు. శుక్రవారం మరోసారి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ నెల 23న వివిధ రాష్ట్రాల రాజ్‌భవన్‌లకు ట్రాక్టర్ల ర్యాలీ తీస్తామని చెప్పారు.  


సుప్రీం ఆందోళన

రైతుల ఉద్యమంపై సుప్రీం గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిం ది. లాక్‌డౌన్‌ సమయంలో తబ్లీగీల సమావేశం, ఆనంద్‌ విహార్‌ వద్ద వలస కూలీలు గుమికూడడానికి సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.  రైతుల ఆందోళనపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. తబ్లీగీ లాంటి పరిస్థితులు రాకుండా చూడండి అని ఆదేశించింది. 




చట్టాల రద్దు తప్ప ఏ ప్రతిపాదననైనా పరిశీలిస్తాం: తోమర్‌ 

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం తప్ప రైతులు చేసే ఏ ప్రతిపాదననైనా పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ గురువారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 40 మంది రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 




చౌరస్తాలో దేశం ఢిల్లీ రాస్తాలో రైతులు : సోనియా

స్వాతంత్య్రం అనంతరం మన దేశం తొలిసారిగా నేడు నాలుగు రోడ్ల కూడలిలో కీలక మలుపులో ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఒకవైపు రైతుల ఆందోళన ఉద్ధృతం కావడం, మరోవైపు కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ధరలను  విపరీతంగా పెంచిన నేపథ్యంలో... ఆమె మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు సాగు చట్టాలను తక్షణమే రద్దు చేసి, రైతుల డిమాండ్లన్నీ ఆమోదించాల్సిందిగా ఆమె గురువారం ఒక ప్రకటనలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి కేంద్రం లాభాలను దండుకుంటోందని సోనియా ఆరోపించారు. ఇంధనాలపై భారీగా పన్నులు వడ్డించి కేంద్రం ప్రజలను లూటీ చేస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడానికి కారణమిదేనని ఆయన గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-08T07:56:28+05:30 IST