సాహిత్యానికి ఇష్టాగోష్ఠి చేయగల దోహదం

ABN , First Publish Date - 2021-03-08T06:05:45+05:30 IST

కవులు రచయితలు తీరిక సమయాల్లో ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే విషయాలు చాలా ఆసక్తి దాయకంగా ఉంటాయి. పక్షానికో నెలకో...

సాహిత్యానికి ఇష్టాగోష్ఠి చేయగల దోహదం

ఇష్టాగోష్ఠి జరుపుతున్న సాహిత్య బృందంలోని వ్యక్తులు సృజన స్థాయిలో మేధోపటిమలో ఎవరూ ఎవరికీ తక్కువ కాకపోయినప్పటికీ వారు ఒకరికి ఒకరు విధేయ శ్రోతగా ఉండాలి. ఫలప్రదమైన సారవంతమైన విషయాలు చేదుకోవడానికి అవసరమైన పురోగామి దృక్పథం కలిగి ఉండాలి. అధ్యయనం కేంద్రంగా ఇష్టాగోష్ఠి జరగాలి.


కవులు రచయితలు తీరిక సమయాల్లో ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే విషయాలు చాలా ఆసక్తి దాయకంగా ఉంటాయి. పక్షానికో నెలకో పండితులు, సృజనకారులు బృందంగా కూర్చుని ఇష్టాగోష్ఠి జరుపుతుంటారు. పాశ్చాత్యులు Table Talk, Small Talk, Chit-Chat, Pleasantry తదితర పేర్లతో పిలిచే కార్యక్రమాల సమాహారమే మన ఇష్టాగోష్ఠి. ఇంట్లోనో, పార్కులోనో, హోటల్‌లోనో, ఈవెంట్‌ రూంలోనో లేదా తమకు హృద్యమైన ఏదేని పరిసరంలోనో, చివరకు వీధి అరుగు మీదనో సాహిత్యాభిమానులు కలిసి బృందంగా ఏర్పడి మాట్లాడుకునే అరుదైన ఘట్టం ఎంతైనా మధురమై నది. అక్కడ స్నేహం బహుదర్జాలు పోతుంది. భాషణ ప్రియత్వానికి ఎల్లలు ఉండవు. The climate of civilization ఉట్టిపడుతుంది. అంతే కాదు సరికొత్త సాహిత్య పంథాలకు, విమర్శకు బీజారోపణ కూడా చేస్తుంది. కొండొకచో సాహిత్యవేత్తల జీవితచరిత్రలు రూపుదిద్దుకు నేందుకూ దోహదపడతుంది. ఇష్టాగోష్ఠి ఈ సందర్భంలో సాహితీ పిపాసుల మధ్య జరిగే సంభాషణ కాబట్టి ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. 


ఓ పుస్తకం గురించో, ఓ కవి గురించో, ఓ వాదం మీదనో, ఏదేని ఒక సమకాలీన సమస్య వద్దనో మొదలైన తమ తమ ఎరుక ఒక సీరియస్‌ సాహిత్యాంశం మీదకు వెళ్తుంది. పిచ్చాపాటి, మాటామంతీ అని కూడా పిలువబడే ఈ ఘట్టంలో పెద్దల నోట ప్రస్తావనకొచ్చే Admirable anecdotes మహాసభలను మించిన సారాన్ని అందిస్తాయి. ఇక్కడ సైద్ధాంతిక తీర్మానాలు ఉండవు కాని, క్యాజువల్‌ ఇంటర్‌ప్రిటేషన్స్‌ సంబంధించిన విలక్షణత ఈ సల్లాపంలో ప్రస్ఫుటం కాగలదు. రచనల బాగోగులు, కవి పండితుల స్థాయీనిర్ణయం, వాదవివాదాల స్థానికీకరణ-కొనసాగింపు- మార్పుచేర్పులు, కొత్త ప్రక్రియల ప్రాదుర్భావం-వికాసాలు- ఆవశ్యకత, ప్రాపంచిక దృక్కోణాలు-మహనీయుల దార్శనికత ఇత్యాది విషయాలపై సాంప్రదాయికంగా నడిచే సాహిత్య సభలకు, కార్యశాలలకు దీటుగా ఒక నిర్గమాన్ని (Output) ఈ ఇష్టాగోష్ఠులు శ్రోతలకు పంచగలవు.


సాహిత్య ప్రక్రియలకు కొన్ని కొలతలు ప్రమాణాలు ఉన్నట్టే ఇష్టాగోష్ఠికి కూడా ‘సమయం-సందర్భం-సాన్నిహి త్యం-సావధానం’ అనే భావగత లక్షణాలుంటాయి. ఇష్టా గోష్ఠిలో మాట్లాడుకునే విషయాలు-వస్తువుపరంగా ఉపోద్ఘాత పూర్వక సంభాషణ, జీవన గమనం- సాధకబాధకాలు, కూర్చున్న ఇద్దరూ లేదా ముగ్గురు నలుగురి లోక పరిశీ లనలు, వారివారి ఆఫీసులు లేదా కార్ఖానాల సంగతులు, సమకాలిక సమవర్తిత విషయాలు, ప్రేరక ప్రోత్సాహక భావనలు- మనోభీష్టాలు-అనుకూల ప్రతికూలతలు వివిధ మౌఖిక శీర్షికల కింద నమోదు అవుతాయి.


సాహిత్య నేపథ్యాన్నంతా విద్వాంసులు ఇష్టాగోష్ఠిలో కూలంకషంగా వడపోస్తారు. ఇక్కడే విమర్శకులకు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఎందుకంటే సాటి కవిపండి తుల పట్ల ఈర్ష్యాద్వేషాల కారణంగా, ఆలోచనాధారలోని దూరం వల్ల, అపరిపక్వత వల్ల, చంచలత్వం చాపల్యాల వల్ల ఇష్టాగోష్ఠి వక్రభాష్యాలకూ (Misinterpretations) దారి తీస్తుంది. మిత్రలాభం కొడిగట్టి మిత్రభేదం పొడసూపకుండా ఇష్టాగోష్ఠిని పరిరక్షించాల్సిన బాధ్యతకూడా కవిపండితులదే.


ఇష్టాగోష్ఠి జరుపుతున్న సాహిత్య బృందంలోని వ్యక్తులు సృజన స్థాయిలో మేధో పటి మలో ఎవరూ ఎవరికీ తక్కువ కాకపోయినప్పటికీ వారు ఒక రికి ఒకరు విధేయ శ్రోతగా ఉండాలి. ఒక బలవర్ధకమైన ఉత్సుకత, స్పష్టమైన ప్రశ్నావళి, ప్రసంగాలకు కలిగే ఆటంకా లను సున్నితంగా అధిగమిం చడం ఇష్టాగోష్ఠి ప్రధాన లక్షణాలుగా ఉండాలి. అన్నిం టికీ మించి ఫలప్రదమైన సారవంతమైన విషయాలు చేదుకోవడానికి అవసర మైన పురోగామి దృక్పథం కలిగుండాలి. అధ్యయనం కేంద్రంగా ఇష్టాగోష్ఠి జర గాలి. ఆభిజాత్యం పనికి రాదు. ఎంక్వైరీ, ఆర్గ్యు మెంట్‌ మరోసారి కలుసు కునేందుకు మృదుఫలంగా దోహద పడాలి. సమాజంలోని మంచి చెడ్డలు (Vicissitudes) సాహిత్యంలో ఎట్లా ప్రతి బింబించాయో, ప్రతిక్షేపించబడ్డాయో తెలపడానికి సంబంధించిన ఒక మెథడాలజీని ఇష్టాగోష్ఠి తర్వాత తరానికి అందించగలగాలి. రచన తనుకు నచ్చితే దానిపై యధారీతి ఇతరులు కూడా ఇష్టం పెంచుకోవ డానికి శాస్త్రీయ ప్రాతిపదికను వివరంగా తెలపాలి. నచ్చక పోతే కూడా అంతే గుణాత్మకంగా అందుకు హేతువులను పేర్కొనాలి. అంతే కాని, ఇష్టాగోష్ఠి కనుక ఎట్లాబడితే అట్లా ఆక్రోశం వెళ్లగక్కుతూ నిరంకుశంగా అభిశంసనకు దిగితే రచన తాలూకు, రచయిత తాలూకు, స్థల కాలాల తాలూకు లోతులు మరుగునపడి కార్యకారణ సంబంధాలు అనబడే యుగధర్మం పక్కకు వెళ్లి కేవల వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలు మాత్రమే మోతాదుకు మించి రికార్డు అవుతాయి. దీనివల్ల ఇష్టాగోష్ఠి ప్రమాణాలైన ‘సమయం- సందర్భం- సాన్నిహిత్యం- సావధానం’ దుబారా అవుతాయి. ప్రాచీనం, ఆధునికం, ప్రక్రియలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతుల వారీగా సాహిత్యవేత్తలు విడిపోయే పరిస్థితికి ఇష్టాగోష్ఠుల ఇరుకుతనమూ కారణమని చెప్పకతప్పదు.


వ్యక్తీకరణ అద్భుతంగా ఉన్నప్పుడు అది ఒక కళగా రాణిస్తుంది. ఈ కళ అలవడడానికి ఇష్టా గోష్ఠే మెరుగైన సాధనం. మంచి వక్తగా విశ్లేష కుడిగా గుర్తింపు పొందాలంటే వ్యక్తీకరణ  నిరం తర నికషం. దీనిలో ఉచ్చరించే భాష, ఉద్వేగ స్థాయి, విషయావగహన, ఉద్దీపనాక్రమం భాగాలు. వియత్నాం కవి, ప్రజోద్యమకారుడు Thich Nhat Hanh సద్భాషణను నిర్వచిస్తూ ఇందుకు ఈ నాలుగు అంశాలను మూలకాలుగా పేర్కొన్నాడు. వీటిని సాహిత్యవేత్తలు కూడా తమ ఇష్టా గోష్ఠిలో నియతంగా పాటించాలి: 1. Tell the truth. Don't lie or turn the truth upside down. 2. Don't exaggerate. 3. Be consistent. This means no double-talk: speaking about something in one way to a person and in the opposite way to another for selfish or manipulative reasons. 4. Use peaceful language. Don't use insulting or violent words, cruel speech, verbal abuse, or condemnation.  (The Art Of Com munication-The Four Elements Of Right Speech, page 52). 


ఒక విలువైన కచ్చితమైన మదింపు దగ్గర ఇష్టాగోష్ఠి మొదలవడమే కాదు ముగియాలి కూడా. అట్లా మొదలై ముగిసే క్రమశిక్షణాయుతమైన ఇష్టాగోష్ఠి కృతిని, కృతికర్తను, కృతికార్యాన్ని జన హితం వైపుకు నడిపించగలదు, సాహిత్య విమర్శ ఆవిష్కరణ పద్ధతిగా (Method of the invention of literary criticism) తనను తాను అభివృద్ధి చేసుకోగలదు.

బెల్లి యాదయ్య, 98483 92690


Updated Date - 2021-03-08T06:05:45+05:30 IST