పచ్చదనాలు ఇచ్చరిల్లే పండుగను

ABN , First Publish Date - 2021-10-14T08:30:17+05:30 IST

తీరొక్క పూలతో నూరొక్క వన్నెలతో నేలమ్మ మెడలు మెరిసే పూలదండల పండుగను...

పచ్చదనాలు ఇచ్చరిల్లే పండుగను

తీరొక్క పూలతో నూరొక్క వన్నెలతో 

నేలమ్మ మెడలు మెరిసే 

పూలదండల పండుగను

సెరువుల సెంపలు సెంగలిచ్చే పండుగను 

పచ్చదనాలన్ని ఇచ్ఛరిల్లే పండుగను

సెముట సెల్లెండ్ల సేదతీర్సే పండుగను 

కూలక్కల ఆటపాటలకు కులాసా పండుగను

నాట్లేసిన నడుములు 

        నాగసరాలయ్యే పండుగను

కలుపులు కలెతీసి 

         కోతలు కోండ్రలైన సేతులు 

సత్తుపిండి అప్పాల సప్పట్ల పండుగను

మట్టి ఆడోళ్ళ పాటకు మలీద ముద్దను

తలమాసిన ఆడోళ్ళ ఆటకు తంగేడురంగును

గులాపాడోల్ల తోటకు గునుగుపూల 

                   బతుకమ్మను

ఆడిబిడ్డలంతా అవ్వ గారిండ్లకు జేరే

ఆర్తి పండుగను. 

సీటి సీరె కట్టుకున్న వూరమ్మ 

    సిబ్బిల పూలు పెట్టుకుని 

సద్దులు మూటగట్టుకొని పోయే 

          ముద్దల పండుగను.

యెనుకట ఎన్నడో వాడక్క

దొబ్బ దెచ్చిందని బతుకమ్మల నుంచి 

               దొబ్బేసి గూడెంను

దూరం జేసిన పాపం

పల్లెలు, పచ్చలు, చెరువులు, కుంటలు పూలు, 

ఆటక్కలు, పాటమ్మలు కలెగలిసిన 

                    కలిమి బతుకమ్మను.

పట్నాలు ప్రపంచమంతా వురికిచ్చినా...

గడీల గల్మలు దాటని,

ఏనాడూ నా దిక్కు సూడని, 

సెముట కన్నెరుగని సేటమ్మల  

నెత్తిమీద నెగడునై ఊరేగినా...

సంగీత సామ్రాట్‌ల

రెపరెప రాగాల్లో వూగించినా...

ఇయ్యాల బతుకమ్మ సెరువుల్నిడిసి, 

       కుంటల్నిడిసి, పచ్చల నిడిసి,

తంగేడు రంగులనిడిసి 

ఆకాశం అంచులు దాటి 

పాట రాని పట్టుచీరల్ల 

పట్టెడుసొమ్ముల కొట్టరాని

సప్పట్లల్ల డీంబాజల డీజే పాటల్ల 

మిన్ను మిట్టల్ల  

జిల్ జిల్ జిగేలైనా...

నా అసలు మూలాలు 

మురిపాల కొసలు

కూలక్కల సెమటలు, కన్నీళ్లు 

       చెరువులైన నీళ్లకాన్నే,

పని పాటక్కల ఆటవిడుపులకు 

    పూలన్నీ దిగబూసి తీర్తమయ్యే తీరొక్క 

రంగులై సెంగలిచ్చిన కాన్నే...

జూపాక సుభద్ర

Updated Date - 2021-10-14T08:30:17+05:30 IST