చర్చిలలో లైంగిక దోపిడీపై ఫ్రెంచ్ రిపోర్ట్ సంచలనం

ABN , First Publish Date - 2021-10-05T22:31:59+05:30 IST

ఫ్రాన్స్‌లోని కేథలిక్ చర్చిలలో ప్రీస్ట్స్, క్లరిక్స్ పాల్పడిన లైంగిక దురాగతాలను

చర్చిలలో లైంగిక దోపిడీపై ఫ్రెంచ్ రిపోర్ట్ సంచలనం

న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌లోని కేథలిక్ చర్చిలలో ప్రీస్ట్స్, క్లరిక్స్ పాల్పడిన లైంగిక దురాగతాలను బయటపెట్టేందుకు ఏర్పాటైన ఇండిపెండెంట్ కమిషన్ నివేదిక ఒళ్ళు గగుర్పొడిచే అంశాలను వెల్లడించింది. మంగళవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం, గడచిన 70 ఏళ్ళలో చర్చి బోధకులు, సిబ్బంది చేతుల్లో దాదాపు 3,30,000 మంది బాలలు లైంగిక దోపిడీకి గురయ్యారు. 


కేథలిక్ చర్చిలలో జరుగుతున్న అత్యంత వినాశకరమైన వాస్తవాలను బయటపెట్టేందుకు ఫ్రాన్స్‌లో మొట్టమొదటిసారి చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. కేథలిక్ చర్చి ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ కమిషన్ దాదాపు రెండున్నరేళ్ళపాటు కృషి చేసి ఓ నివేదికను విడుదల చేసింది. బాధితులు, సాక్షులు చెప్పిన విషయాలను నమోదు చేసి, చర్చి, కోర్టు, పోలీసు, ప్రెస్ ఆర్కైవ్స్‌ను అధ్యయనం చేసి 2,500 పేజీల నివేదికను రూపొందించింది. 1950వ దశకం నుంచి జరుగుతున్న దురాగతాలను పరిశీలించింది. 


బాధితుల్లో 80 శాతం మంది పురుషులు

ఈ ఇండిపెండెంట్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్-మార్క్ సౌవే మాట్లాడుతూ, శాస్త్రీయ పరిశోధన ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. చర్చి ప్రీస్ట్స్, క్లరిక్స్, చర్చితో సంబంధంగల నాన్ రెలిజియస్ వ్యక్తులు పాల్పడిన లైంగిక దాడుల సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. బాధితుల్లో 80 శాతం మంది పురుషులేనని చెప్పారు. లైంగిక దాడుల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. ఈ దాడులకు గురైనవారిలో సుమారు 60 శాతం మంది తమ మానసిక, సెక్సువల్ జీవితాల్లో చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. 2000వ సంవత్సరం ప్రారంభం వరకు బాధితుల పట్ల చర్చి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. బాధితులను నమ్మలేదని, వారి మాటలు వినలేదని చర్చిపై విమర్శలు గుప్పించారు. జరిగినదానిలో కొంత బాధ్యత బాధితులకు కూడా ఉందని చర్చి అనుమానించేదని చెప్పారు.


మూడింట రెండొంతుల మంది ప్రీస్ట్స్ 

బాలలను లైంగిక దోపిడీకి గురి చేసినవారి సంఖ్య దాదాపు 3,000 ఉంటుందని, వీరిలో మూడింట రెండొంతుల మంది ప్రీస్ట్స్ అని ఈ నివేదిక పేర్కొంది. ప్రీస్ట్స్, ఇతర క్లరిక్స్ చేతుల్లో లైంగిక దోపిడీకి గురైనవారి సంఖ్య 2,16,000 ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపింది. 


చర్చికి భయానకం

బాధితుల సంఘం ప్రెసిడెంట్ ఓలివియెర్ సవిగ్నాక్ మీడియాతో మాట్లాడుతూ, లైంగిక దాడులకు పాల్పడిన ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో బాధితుల సంఖ్య అత్యధికంగా ఉండటం ఫ్రెంచ్ సమాజానికి, కేథలిక్ చర్చికి భయానకమని తెలిపారు. 


45 సిఫారసులు

ఇదిలావుండగా, ఇటువంటి దురాగతాలను నిరోధించడానికి ఈ కమిషన్ 45 సిఫారసులను చేసింది. ప్రీస్ట్స్, క్లరిక్స్‌కు శిక్షణ ఇవ్వడం, కెనన్ లా‌ను పునఃసమీక్షించడం, బాధితులకు నష్టపరిహారం చెల్లించడం వంటి సిఫారసులు చేసింది.


Updated Date - 2021-10-05T22:31:59+05:30 IST