పట్టుబడ్డ డీజల్‌ దొంగల ముఠా

ABN , First Publish Date - 2021-09-29T06:24:25+05:30 IST

అంతర్రాష్ట డీజల్‌ దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడ్డ డీజల్‌ దొంగల ముఠా
నిందితులతో డీఎస్పీ సుధాకరరెడ్డి, సీఐ బాలయ్య తదితరులు

12 మంది నిందితుల అరెస్టు 

2100 లీటర్ల డీజల్‌....నాలుగు లారీలు, నగదు  సీజ్‌


చిత్తూరు, సెప్టెంబరు 28: అంతర్రాష్ట డీజల్‌ దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు.2100 లీటర్ల డీజల్‌తో పాటు రవాణా చేయడానికి ఉపయోగించిన నాలుగు లారీలు, రూ.1.24లక్షల నగదును సీజ్‌ చేసి 12 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.డీఎస్పీ సుధాకరరెడ్డి, సీఐ బాలయ్య కథనం మేరకు.....ఇటీవల చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో ఆగివున్న లారీల నుంచి డీజల్‌ దొంగతనం జరుగుతుండడం పోలీసుల దృష్టికి ఎక్కువసార్లు వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు మంగళవారం చిత్తూరు సమీపంలోని తిరుపతి-బెంగళూరు బైపాస్‌రోడ్డులో వున్న సీతమ్స్‌ కళాశాలల వద్ద తాలూకా, ఒకటో పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.అనుమానంతో రెండు లారీలతో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన అలీ హుస్సేన్‌,  షారుక్‌మన్‌,పవన్‌గుజ్జార్‌, దీపక్‌ కుంభకర్ణ, పప్పుయాదవ్‌, అస్రఫ్‌ మన్‌సూరిలను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో అక్కడికి సమీపంలోని చెర్లోపల్లె వద్ద రెండు లారీలను, మధ్యప్రదేశ్‌కు చెందిన జావిద్‌ ఖా, తాలిబ్‌ఖాన్‌, రఫిక్‌ఖాన్‌, పర్వేజ్‌ఖాన్‌, షాధిక్‌ కా మేవాటి, సల్మాన్‌ఖాన్‌లను అదుపులోకి తీసుకుని  విచారించారు.వారిచ్చిన సమాచారంతో చిత్తూరు సమీపం లోని బంగారుపాళ్యం వద్ద డీజల్‌ కొనుక్కునే దావూద్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 300 లీటర్ల డీజల్‌ను,నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు.డీజల్‌ తీసుకోవడానికి,నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగించే క్యాన్లు, పైపులు, దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే వారిపై దాడి చేయడానికి తెచ్చుకున్న రాడ్లు, రూ. 1,24,500 నగదును సీజ్‌ చేశారు.ముఠాను పట్టుకోవడంవలో కృషి  చేసిన ఎస్‌ఐలు వి. రామకృష్ణ, అనిల్‌కుమార్‌ ,దిలీప్‌కుమార్‌, ఏఎస్‌ఐ దేవరాజులు, సిబ్బంది సుధాకర్‌, సోమశేఖర్‌, మధుబాబు, సంషీర్‌, రామ్‌కుమార్‌లను డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2021-09-29T06:24:25+05:30 IST