దూసుకొస్తున్న మిడతల దండు

ABN , First Publish Date - 2020-05-28T10:46:18+05:30 IST

ఉత్తరాది రాష్ర్టాల మీదుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు జిల్లా

దూసుకొస్తున్న మిడతల దండు

మహారాష్ట్రలోకి ప్రవేశం   

జిల్లా వైపు దూసుకువచ్చే అవకాశం

రైతుల్లో మొదలైన ఆందోళన 

అప్రమత్తమైన వ్యవసాయ శాఖ

శబ్దాలు, రసాయనాలతో తరిమేయవచ్చంటున్న శాస్త్రవేత్తలు


ఆదిలాబాద్‌, మే27 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది రాష్ర్టాల మీదుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు జిల్లా వైపుకు వేగంగా దూసుకు వస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఉన్న జిల్లాకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనాతో అతలా కుతలమవుతున్న రైతులకు మిడతల బెడదతో కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు సుమారుగా 200 కి.మీల దూరంలో ఉన్న మిడతలు జిల్లాలోకి ప్రవేశిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. పది రకాలుగా ఉండే మిడత ల్లో ఎడారి మిడతలు అత్యంత ప్రమాదకరమైనవిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అన్ని రకాల ఆకులను తినే మిడతలు పత్తి, మెక్కజొన్న, జొన్న లాంటి పంటలను బాగా ఇష్టపడతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పంటలు లేక పోవడం తో పెద్దగా నష్టం ఉండదంటున్నారు. రైతులు వేసవి దుక్కులు చేయడం, పంట పొలాలను చదును చేసుకోవడం లాంటి పనుల్లో నిమగ్నమయ్యారు.


మరో వారం రోజుల్లో వానాకాల సీజన్‌ ప్రారం భమయ్యే అవకాశం ఉంది. ఈ యేడు జిల్లా వ్యాప్తంగా 2.30లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికా రులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 1.44లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. జిల్లా రైతులు తొలకరి వర్షాలకే పత్తి, కంది, సోయా పంటలను సాగు చేస్తారు. ఆ తర్వాతనే ఇతర పంటలను వేస్తారు. మరో వారం రోజుల్లో వానాకాల సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిడతలు జిల్లాలోకి ప్రవేశిస్తే భారీ నష్టం జరుగనుంది. ఇప్పటికే మిడతల బెడదపై జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవాలని ఆదేశించింది. మండల, గ్రామ స్థాయిలో నిఘా బృందాలను ఏర్పాటు చేసి మిడతల రాకను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించింది.


సరిహద్దు మండలాల్లో ఆందోళన.. 

మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన బోథ్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, భీంపూర్‌, నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో మిడతల బెడదపై ఆందోళన కనిపిస్తోంది. మిడతలు జిల్లాలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని రోజుల పాటు వాటి ప్రభావం ఉంటుందో ఖచ్చితంగా తెలియక పోవడంతో అయో మయం ఏర్పడుతోంది. అసలే ప్రస్తుతం చిగురు కాలం కావడంతో పంట పొలాల సమీపంలోని అడవులు చిగురించి లేత ఆకులతో పచ్చగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మిడతలు చెట్లపై ఆవాసం ఏర్పర్చుకొని పంటలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి పంటలు లేక పోయిన వాటి బెడదతో పంటలపై కొంత ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.


అప్రమత్తమైన అధికారులు..

మహారాష్ట్ర నుంచి మిడతల దండు వస్తున్నట్లు సమాచారం తెలి యడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సరిహద్దు మండలాలపై దృష్టి సారిస్తున్నారు. ఏ సమ యంలోనైనా జిల్లాలోకి మిడతలు ప్రవేశిస్తే తరిమి వేసేందుకు సిద్ధమ వుతున్నారు. వివిధ రకాల రసాయనాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి మిడతల బెడద ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితు ల్లో మిడతలతో పెద్దగా నష్టంలేక పోయిన జిల్లాలో ఎక్కవ రోజుల పాటు తిష్ట వేస్తే ఇబ్బందులలు తప్పవంటున్నారు.  ఒకవేళ జిల్లాలోకి ప్రవేశించిన రైతులు అప్రమత్తంగా ఉండి వివిధ రకాల శబ్దాలు, రసా యనాల పిచికారీతో తరిమి వేయాలని అధికారులు సూచిస్తున్నారు. 


ఈ స్థాయిలో మిడతలను చూడలేదు..శ్రీధర్‌చౌహాన్‌, పరిశోధన స్థానం సీనియర్‌ శ్రాస్తవేత్త

గతంలో పంటలపై మిడతల బెడద ఉన్నా ఈ స్థాయిలో ఎన్నడూ చూడలేదు. ఇప్పటికే ఉత్తరాది రాష్ర్టాలలో పంటలను తీవ్రంగా నష్ట పరిచిన మిడతలు జిల్లా వైపుకు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మన జిల్లాలో ఎలాంటి పంటలు లేవు. కానీ పంటలు వేసిన తర్వాత ప్రవేశిస్తే భారి నష్టమే జరిగే అవకా శం ఉంది. రైతులు వివిధ రకాల శబ్దాలు చేస్తూ రసాయనాలతో మిడతల బెడదను నివారించవచ్చు. పంటలపై రసాయనాల పౌడర్‌ను చల్లితే తినేందుకు ఇష్టపడవు. అలాగే తొందరగానే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయి. 

Updated Date - 2020-05-28T10:46:18+05:30 IST