కార్యసాధకులకు మార్గదర్శి

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

హనుమ.. భారతీయ ఇతిహాసాల్లో అగణితమైన ప్రతిభాపాటవాలను చూపిన ఘనతర

కార్యసాధకులకు మార్గదర్శి

హనుమ.. భారతీయ ఇతిహాసాల్లో అగణితమైన ప్రతిభాపాటవాలను చూపిన ఘనతర దైవం. అంతేకాదు, పరిపూర్ణమైన జీవితానికి కావలసిన ఉత్తమ సందేశాలు ఎన్నిటినో ప్రసాదించిన అద్వితీయ వ్యక్తిత్వం ఆంజనేయునిది. హనుమ జనరంజకంగా చేసిన సాహసాలు, సాధించిన విజయాలు పరహితం కోసమే కావడం అత్యంత విశేషం. 


హనుమకు ఉన్న ఉత్తమ లక్షణాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది అతనికే సొంతమైన సంభాషణా చాతురి. సందర్భానికి తగినట్లుగా మాట్లాడగల చతురుడు అంజనీ తనయుడు. రామ లక్ష్మణుల చెంతకు హనుమను దూతగా సుగ్రీవుడు పంపినప్పుడు... ఆంజనేయుడి వినయశీలవర్తనకు, సంతులితమైన సంభాషణాశైలికి శ్రీరాముడు అప్రతిభుడవుతాడు. నవవ్యాకరణాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి, సామవేదజ్ఞుడు అయిన విద్వాంసుడు మాత్రమే హనుమలా సుందరంగా, సముచితంగా మాట్లాడగలడని సౌమిత్రికి శ్రీరాముడు చెబుతాడు


సీతాదేవిని అన్వేషిస్తూ రామ లక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీదకు వచ్చినప్పుడు... తన సోదరుడైన వాలి పంపగా, వారు తనను చంపడానికి వచ్చారేమో? అని భయపడిన సుగ్రీవునితో హనుమ జరిపే సంభాషణ అద్భుతంగా ఉంటుంది. ‘‘ఓ వానర రాజా... నీవు మా అందరికీ రాజువై ఉండి కూడా, భయవిహ్వలుడవై, స్వభావ సిద్ధమైన నీ చంచలత్వాన్నే ప్రకటిస్తున్నావు. నీ బుద్ధిని, విజ్ఞానాన్ని, ఇంగితాన్ని ఉపయోగించి, ఇతరుల స్వభావాన్ని గుర్తించి, యుక్తమైన పద్ధతిలో ఆలోచించు’’ అంటాడు. 


‘బుద్ధి’ అంటే అందరికీ ఉండే సామాన్యజ్ఞానం కాగా వ్యక్తికి ఉండే విశేషమైన జ్ఞానమే ‘విజ్ఞానం’. ఇక ‘ఇంగితం’ అంటే ఒక విషయం మీద అభిప్రాయాన్ని తెలియజేసే ప్రవర్తనాశైలి. ఒకే వాక్యంలో మూడు చక్కటి పదాలను ప్రయోగించి, సుగ్రీవునికి హితబోధ చేయడం-  మాటల విలువ, శక్తి తెలిసిన హనుమకే సాధ్యం. వినయమనే సుగుణంతో సుగ్రీవునికి అమాత్యునిగా హనుమ సమయోచితంగా వ్యవహరిస్తూ, అతనికి సదా హితాన్ని చేకూర్చడం ‘రామాయణం’లో మనకు  పలుచోట్ల కనిపిస్తుంది.




సాధకుడు కార్యాన్ని పూర్తిచేసేందుకు ఉపక్రమించాక మార్గమధ్యంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని దాటడానికి కావలసింది నిశ్చలమైన మనస్సు. హనుమంతుడు సీతాదేవిని అన్వేషించే క్రమంలో, సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో వింతకాంతులతో ప్రకాశిస్తున్న పర్వతశ్రేష్టుడు మైనాకుడు ఎదురయ్యాడు. హనుమను కీర్తిస్తూ తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. ‘‘నేను నీకు ఎంతో ఆత్మీయణ్ణి’’ అని చెబుతూ, ఆ నేపథ్యాన్ని కూడా వివరించాడు మైనాకుడు. 


సావధానంగా అన్నీ విన్న హనుమ చిరునవ్వుతో ‘‘మైనాకా.. నీవు నాకు ఆత్మీయుడవే. కానీ నేను ఇప్పుడు ఆతిథ్యం స్వీకరించి విశ్రమించే సమయం కాదు. సూర్యాస్తమయంలోగా నేను లంకానగరికి చేరి, సీతామాతను అన్వేషించాలి. అన్యథా భావించవద్దు’’ అంటూ అతని కోరికను సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగాడు. 

హనుమ ఒక్కసారి కార్యసాధన కోసం ముందుకు దూకితే వెనుకంజ వేయడు. ప్రతి కార్యసాధకుడు తప్పనిసరిగా అనుసరించవలసింది ఇదే. పటుతరమైన సాధన చేస్తూ, ముందుకు సాగితేనే కార్యసిద్ధి కలుగుతుంది. 


అదే విధంగా, సీతాదేవిని అశోకవనంలో కనుగొన్న సందర్భంలో ఆమెతో ఎలా సంభాషణ ఆరంభించాలన్న సందేహానికి ఒకింత లోనైనా, సమయస్ఫూర్తితో ముందుగా శ్రీరామచరితాన్ని వల్లెవేసి, ఆమెలో నమ్మకాన్ని కలిగించడం... హనుమలో సమృద్ధిగా నిండిఉన్న సందర్భశుద్ధిని తేటతెల్లం చేస్తుంది.


యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సూచన మేరకు సంజీవనీ పర్వతానికి వెళ్ళి.... తేవలసిన ఓషధులను తాను పోల్చుకోలేకపోయిన సందర్భంలో... కాలయాపన చేయడం ప్రయోజన శూన్యమని తలచి, పర్వతాన్నే పెళ్ళగించుకు వచ్చిన సమర్థుడు హనుమ. కార్యసాధనలో కాలానికి ఉన్న అమూల్యమైన విలువను ఈ సందర్భంలో హనుమ ప్రకటిస్తాడు.


హనుమ చరితకు సాధికారమైన గ్రంథంగా పరిగణించేది ‘పరాశర సంహిత’. కమనీయమైన హనుమ చరితాన్నీ, సుగుణాలను ‘పరాశర సంహిత’ ఎంతో చక్కగా మనకు తెలుపుతుంది. హనుమ సకలవిద్యా ప్రపూర్ణుడు. కార్యసాధకులకు తన వర్తనద్వారా అద్వితీయంగా మార్గదర్శనం చేసే పరిపూర్ణుడు.

 వెంకట్‌ గరికపాటి


Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST