స్టాక్‌ మార్కెట్లో లాభాల హోరు

ABN , First Publish Date - 2021-08-02T05:58:32+05:30 IST

బుల్‌ మార్కెట్‌.. ఈక్విటీ మదుపరులకు లాభాల వర్షం కురిపిస్తోంది. మార్కెట్‌ ర్యాలీతో ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో సెన్సెక్స్‌ 6.21 శాతం (3,077.69 పాయిం ట్లు) దూసుకుపోయింది.

స్టాక్‌ మార్కెట్లో లాభాల హోరు

 4 నెలల్లో రూ.31 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

న్యూఢిల్లీ: బుల్‌ మార్కెట్‌.. ఈక్విటీ మదుపరులకు లాభాల వర్షం కురిపిస్తోంది. మార్కెట్‌ ర్యాలీతో ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో సెన్సెక్స్‌  6.21 శాతం (3,077.69 పాయిం ట్లు) దూసుకుపోయింది. దీంతో మదుపరుల సంపద విలువ అదనంగా రూ.31,18,934 కోట్లు పెరిగింది. అంతేకాకుండా బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) కూడా రూ.235.49 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం కొద్దిగా ఆటుపోట్లు ఉన్నా గత నెల 15న సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో 53,158.85 వద్ద ముగిసింది. ఆ మరుసటి రోజు ఇంట్రాడేలో గతంలో ఎన్నడూ లేని విధంగా 53,290.81 స్థాయిని తాకింది. 


కలిసొచ్చిన అంశాలు: ప్రస్తుతం వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో మిలీనియల్స్‌ ఎవరూ పెద్దగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల జోలికి పోవడం లేదు. రియల్టీ మార్కెట్‌ అంత బాగా లేదు. సంప్రదాయ మదుపరులదీ ఇదే పరిస్థితి. వీరిలో ఎక్కువ మంది ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌ మీదే దృష్టి పెట్టారు. ఐపీఓల బంపర్‌ లాభాలూ రిటైల్‌ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. అమెరికా, యూర్‌పల్లో కొనసాగుతున్న జీరో ఇంటరెస్ట్‌ రేట్లూ.. భారత స్టాక్‌ మార్కెట్‌కు కలిసొస్తున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నాయి. జీరోధా, అప్‌స్టాక్స్‌ వంటి డిస్కౌంట్‌ బ్రోకరేజీ సంస్థల పుణ్యమాని స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు మరింత సులభతరం అయ్యాయి. బ్రోకరేజీ సంస్థల ఆఫీసులకు వెళ్లకుండా స్మార్ట్‌ఫోన్ల మీదే లావాదేవీలు నిర్వహించే సౌలభ్యం ఏర్పడింది. వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానమూ మార్కెట్‌ ర్యాలీకి కలిసొస్తోంది. 


స్మాల్‌ స్టాక్స్‌దే హవా

గత నాలుగు నెలల్లో స్మాల్‌ స్టాక్స్‌ ఇండెక్స్‌ 29.72 శాతం పెరిగింది. ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 14.39 శాతం, లార్జ్‌ క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్‌ 6.21 శాతం మాత్రమే పెరిగాయి. దీంతో కొన్ని స్మాల్‌ క్యాప్‌ షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు భారీ లాభాలు  చవిచూశారు. 


ఈ వారం మరో 4 ఇష్యూలు 

ఈ వారం రూ.3,614  కోట్ల సమీకరణకు మరో నాలుగు  కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌కు వస్తున్నాయి. విండ్‌లాస్‌ బయోటెక్‌, దేవయాని ఇంటర్నేషనల్‌, కృష్ణా డయాగ్నోస్టిక్స్‌, ఎగ్జారో టైల్స్‌ కంపెనీల ఐపీఓలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తాయి. 

Updated Date - 2021-08-02T05:58:32+05:30 IST