అమూల్‌ పేరుతో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2021-05-06T08:32:54+05:30 IST

‘‘ఏపీ డెయిరీ ఆస్తులను ఏకపక్షంగా గుజరాత్‌ పాల డెయిరీ అమూల్‌కు జగన్‌ ప్రభుత్వం అప్పగించడం వెనుక భారీ డెయిరీ కుంభకోణం దాగి ఉంది. రూ.2,300 కోట్ల విలువైన ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తే దాని నుంచి

అమూల్‌ పేరుతో భారీ కుంభకోణం

2,300 కోట్లు వెచ్చిస్తే ఏడాదికి వచ్చేది 3 కోట్లే

ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువిస్తోంది

టెండర్లు ఎందుకు పిలవలేదు?

ఇందులో నీకిది... నాకిది వ్యవహారం దాగుంది: టీడీపీ


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీ డెయిరీ ఆస్తులను ఏకపక్షంగా గుజరాత్‌ పాల డెయిరీ అమూల్‌కు జగన్‌ ప్రభుత్వం అప్పగించడం వెనుక భారీ డెయిరీ కుంభకోణం దాగి ఉంది. రూ.2,300 కోట్ల విలువైన ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తే దాని నుంచి ఏడాదికి కేవలం రూ.3 కోట్ల ఆదాయం మాత్రం  రాబోతోంది. ఇంత తక్కువ ఆదాయం కోసం ఇన్ని వేల కోట్ల ఆస్తులను అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది’’ అని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం బుధవారం ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం కేవలం ఏపీ డెయిరీ ఆస్తులను కారు చౌకగా తాకట్టు పెట్టడానికే జరిగినట్లు ఉంది. కరోనా సమస్యను ఎజెండాలో వెనక్కు నెట్టి దాని కంటే ముందు దీనిని పెట్టడంలోనే ప్రభుత్వ ఉద్దేశం కనిపిస్తోంది’’ అని విమర్శించారు. అమూల్‌కి అప్పగించాలని మంత్రి వర్గంలో నిర్ణయించిన ఏపీ డెయిరీ యూనిట్లలోని యంత్రాల విలువ రూ.550 కోట్లు ఉంటుందన్నారు. వాటి భవనాలు, భూముల విలువ కూడా కలుపుకొంటే రూ.750 కోట్లు అవుతుందని వివరించారు. ఇది కాక రాష్ట్రంలోని 9,800 గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో బల్క్‌ మిల్క్‌ కూలర్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. 


ఒక్కో కూలర్‌ ఏర్పాటుకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.1,500 కోట్లు ఖర్చవుతుందన్నారు. కేవలం అమూల్‌ సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇదికాక ఒంగోలు డెయిరీకి ఉన్న అప్పు రూ.64 కోట్లు కూడా తామే భరిస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ‘‘అంటే అమూల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం రూ.2,314 కోట్లు. ఇంత ఖర్చు పెడితే ఈ ఆస్తులను వినియోగించుకొన్నందుకు అమూల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం ఏడాదికి గరిష్ఠంగా రూ.3.30 కోట్లు. పాల సేకరణ తగ్గితే ఆ ఆదాయం ఇంకా తగ్గిపోతుంది’’ అని వివరించారు. ఇదే అమూల్‌ సంస్థ పొరుగు రాష్ట్రాల్లో మాత్రం మనకంటే ఎక్కువ చెల్లిస్తోందని విడమరిచారు. ఆ ధరలను పరిగణనలోకి తీసుకొంటే మన రాష్ట్రానికి ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం రావాలన్నారు.


‘‘ఆ సంస్థపై ఎందు కీ ప్రేమ? నీకిది... నాకిది తరహా ఒప్పందాలకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పెట్టింది పేరు. ఆయనపై నమోదైన కేసులు కూడా దీనిపైనే అయ్యాయి. ఇందులో కూడా ఇటువంటి వ్యవహారం ఉందని అనుమానించాల్సి వస్తోంది’ అని ఆయన ఆరోపించారు. ప్రతి దానికి రివర్స్‌ టెండరింగ్‌ అంటూ హడావుడి చేసే వైసీపీ ప్రభుత్వం ఏ టెండర్లూ పిలవకుండా ఏకపక్షంగా ఈ ఆస్తులను అమూల్‌కు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించారు. ఇవే ప్రోత్సాహాలు తమకు ఇస్తే అమూల్‌కు మించి ఎక్కువ రేటు పాడి రైతులకు ఇస్తామని రాష్ట్రంలో ఉన్న పాల డెయిరీలు సంప్రదించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, తెర వెనుక ఉన్న కుంభకోణానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-06T08:32:54+05:30 IST