నలుగురి అరెస్ట్‌తో తప్పిన భారీ ఉగ్ర ముప్పు

ABN , First Publish Date - 2021-08-14T20:49:47+05:30 IST

జమ్మూ-కశ్మీరు పోలీసులు శనివారం నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను

నలుగురి అరెస్ట్‌తో తప్పిన భారీ ఉగ్ర ముప్పు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు పోలీసులు శనివారం నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ ఉగ్రవాద దాడి ముప్పు తప్పింది. స్వాతంత్ర్య దినోత్సవాలనాడు పెద్ద ఎత్తున దాడి చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. 


జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు, వారి అనుచరులు భారీ కుట్ర పన్నినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపారు. డ్రోన్ల ద్వారా వచ్చిన ఆయుధాలను సేకరించి, కశ్మీరులోని ఇతర ఉగ్రవాదులకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15కు ముందే జమ్మూలో ఓ ఐఈడీని అమర్చడానికి వీరు ప్రయత్నించారన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీరు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాద దాడి చేయడానికి ఓ మోటార్ సైకిల్‌తో ఐఈడీని పేల్చాలని వీరు కుట్ర పన్నినట్లు చెప్పారు. 


పోలీసులు మొదట పుల్వామాలోని ప్రిచూ ప్రాంతంలో ముంతజిర్ మంజూర్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు, ఓ మ్యాగజైన్, ఓ చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్, ఎనిమిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీరు లోయకు ఆయుధాలను రవాణా చేసే లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించినపుడు పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ మునజిర్ వురపు షాహిద్ ఆదేశాల మేరకు వీరు పని చేస్తున్నట్లు  తెలిసింది. డ్రోన్ ద్వారా ఆయుధాలను పంజాబ్‌లో జారవిడుస్తామని, వాటిని తీసుకోవాలని షాహిద్ చెప్పినట్లు ఓ ఉగ్రవాది పోలీసులకు తెలిపాడు. పానిపట్ ఆయిల్ రిఫైనరీ వద్ద రెక్కీ నిర్వహించాలని  తనకు ఆదేశాలు అందినట్లు తెలిపాడు. తాను ఆ రిఫైనరీ ఫొటోలను షాహిద్‌కు పంపించానని చెప్పాడు. అయోధ్య రామ జన్మభూమి గురించి కూడా పూర్తిగా సమాచారం ఇవ్వాలని తనను ఆదేశించాడని తెలిపాడు. 


జమ్మూలో ఓ ఇల్లు తీసుకుని ఉండాలని తనకు చెప్పారని మరొక ఉగ్రవాది తౌసీఫ్ అహ్మద్ షా పోలీసులకు చెప్పాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్‌ను సంపాదించి, జమ్మూలో ఐఈడీ పేలుడుకు ఉపయోగించాలని ఆదేశించారని చెప్పాడు. ఈ ఐఈడీని డ్రోన్ ద్వారా జారవిడుస్తామని చెప్పారని తెలిపాడు. 


పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న మరొక ఉగ్రవాది జహంగీర్ అహ్మద్  జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు యువతను రిక్రూట్ చేస్తున్నాడని వెల్లడైందని పోలీసులు తెలిపారు. 


ఇదిలావుండగా, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జమ్మూ-కశ్మీరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. 


Updated Date - 2021-08-14T20:49:47+05:30 IST