మనిషంత గబ్బిలం.. వైరలవుతున్న ఫోటోలు..

ABN , First Publish Date - 2020-07-03T22:31:18+05:30 IST

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఓ పేరు వింటేనే వణికిపోతున్నారు. అదే గబ్బిలం. లక్షల ప్రాణాలను...

మనిషంత గబ్బిలం.. వైరలవుతున్న ఫోటోలు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఓ పేరు వింటేనే వణికిపోతున్నారు. అదే గబ్బిలం. లక్షల ప్రాణాలను బలిగొంటున్న కరోనాను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ గబ్బిలమే. అందుకే గబ్బిలం పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. ఇక దానిని చూస్తే ఆమడదూరం పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ భారీ గబ్బిలం.. దాదాపు మనిషంత సైజులో ఉండి తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తే.. దానిని చూసిన మరుక్షణమే మతి పోతుంది. మూర్ఛవచ్చినంత పనౌతుంది. అయితే ఇలాంటి పరిస్థితే ఫిలిప్పైన్స్‌లోని అలెక్స్ అనే వ్యక్తికి ఎదురైంది. ఓ పాత ఇంటి ఆవరణలో భారీ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ కనిపించింది. దీనిని చూసిన అలెక్స్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో దానిని ఫోటోలు తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన ఇంటి దగ్గరలో ఈ గబ్బిలం కనిపించిందని, దీని రెక్కలు దాదాపు 5.5 అడుగుల వెడల్పు ఉంటాయని, అయితే శరీరం మాత్రం బక్కపలచగా ఓ సాధారణ కుక్క సైజులో ఉంటుందని పేర్కొన్నాడు.


దీనీని ‘జైంట్ గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్’ అని అక్కడి వారు పిలుచుకుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ గబ్బిలాలు పూర్తి శాకాహారులని, కేవలం పండ్లను మాత్రమే తింటాయని, మాంసాహారం అసలు ముట్టవని అలెక్స్ చెప్పాడు. అలెక్స్ ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 2.63 లక్షల లైక్స్, 1.05 లక్షల రీట్వీట్స్ నమోదయ్యాయి. చాలా మంది ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.




Updated Date - 2020-07-03T22:31:18+05:30 IST