అనుమానం పెనుభూతమైంది!

ABN , First Publish Date - 2022-08-08T09:40:22+05:30 IST

పెళ్లయిన మూడు నెలలకే భార్యపై అనుమానం..ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్య, బిడ్డను చంపి తనూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త.

అనుమానం పెనుభూతమైంది!

భార్య బిడ్డను కడతేర్చిన భర్త.. అనంతరం ఉరేసుకుని బలవన్మరణం

అల్లూరు, ఆగస్టు 7: పెళ్లయిన మూడు నెలలకే భార్యపై అనుమానం..ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్య, బిడ్డను చంపి తనూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పెద్దపట్టపుపాళెంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కోవూరు రూరల్‌ సీఐ ఖాజావలి కథనం మేరకు.. పెద్దపట్టపుపాళెంకు చెందిన ఆవల మురళికి(25) అదే ప్రాంతానికి చెందిన స్వాతి  (22)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. పెళ్లయిన మూడు నెలల నుంచే మురళి భార్యపై అనుమానం పెంచుకోవడంతో, భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఇందుకు మురళి తల్లిదండ్రులు ఆవల గోవిందయ్య, బంగారమ్మల ప్రోత్సాహం కూడా ఉందని స్వాతి తన పుట్టినింటివారికి తెలిపింది. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం స్వాతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని, అదికూడా తన పోలికలతో లేదనే కారణాలతో మురళి భార్యను వేధించసాగాడు. ఆడపిల్ల పుట్టి ఐదు నెలలు గడుస్తున్నా స్వాతిని కాపురానికి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ఆడపడుచు వెంకటమ్మ కోరిక మేరకు, పుట్టింటివారు నచ్చచెప్పడంతో ఈ నెల 4వ తేదీన ఆమె మెట్టినింటికి చేరింది. అయితే, శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డ మురళి.. స్వాతి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పసికందునూ ఊపిరాడనీయకుండా చేసి ప్రాణాలు తీశాడు. పరారయ్యేందుకు ప్రయత్నించి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి నగదు అడిగాడు. వారు నిరాకరించడంతో ఏం చేయాలో దిక్కుతోచక తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ ఖాజావలి, ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి గోవిందయ్య, బంగారమ్మ, వెంకటమ్మలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-08-08T09:40:22+05:30 IST