ఓ రాజ్యం మీసం మెలేసింది

అతని పేరు బింబిసార. ధైర్యం తన ఆభరణం. కళ్లతో కాదు.... కత్తితో చూస్తాడు. మాట్లాడితేనే, వేటాడినట్టు ఉంటుంది. అతన్ని ఎదరించలేక రాజ్యాలే.. తన ముందు మోకరిల్లాయి. తన కథేమిటో తెలియాలంటే ‘బింబిసార’ చూడాలి. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. క్యాథరిన్‌, సంయుక్తా మీనన్‌ కథానాయికలు. వశిష్ఠ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం టీజర్‌ విడుదలైంది. 


‘‘ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే, ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏక ఛత్రాధిపత్యం’’ అనే డైలాగ్‌ ఈ టీజర్‌లో వినిపించింది. కత్తి పట్టి, నెత్తుటి వర్షంలో బింబిసారుడిగా కల్యాణ్‌ రామ్‌ యుద్ధం చేస్తున్న దృశ్యాలు టీజర్‌లో కనిపించాయి. ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ పాత్ర లో రెండు పార్వ్శాలు, రెండు కాలాలూ... ఇమిడి ఉంటాయన్న సంగతి టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘‘కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’న్నారు దర్శకుడు. సంగీతం: చిరంతన్‌ భట్‌. 


Advertisement