ఎయిరిండియా విమానం సిల్చార్‌లో అత్యవసర ల్యాండింగ్

ABN , First Publish Date - 2021-11-10T18:57:41+05:30 IST

అస్సాంలోని సిల్చార్, కుంబిర్‌గ్రామ్ విమానాశ్రయం నుంచి

ఎయిరిండియా విమానం సిల్చార్‌లో అత్యవసర ల్యాండింగ్

కోల్‌కతా : అస్సాంలోని సిల్చార్, కుంబిర్‌గ్రామ్ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం కాసేపటికే తిరిగి క్రిందకు దిగింది. 144 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ గుర్తించి, తిరిగి సిల్చార్ విమానాశ్రయంలోనే దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. 


సిల్చార్-కోల్‌కతా ఎయిరిండియా విమానం బుధవారం ఉదయం సిల్చార్‌లోని కుంబిర్‌గ్రామ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి, అప్రమత్తమై తిరిగి అదే విమానాశ్రయానికే తీసుకెళ్ళి దించేశారు. విమానాశ్రయం డైరెక్టర్ పీకే గోరాయ్ మాట్లాడుతూ, విమానంలో హైడ్రాలిక్ లీక్‌తోపాటు సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ గుర్తించారన్నారు. వెంటనే సిల్చార్ విమానాశ్రయంలోనే దించేశారని చెప్పారు. విమానాశ్రయం వద్ద పూర్తి స్థాయిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు. ఈ విమానం ల్యాండింగ్ గేర్ విఫలమైందన్నారు. ఈ సాంకేతిక లోపానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇది చాలా పెద్ద విమానమని, ఈ విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే ఉందని తెలిపారు. ఈ రన్‌వేను కూడా బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఈ విమానం ఇక్కడి నుంచి బయల్దేరకపోతే, మిగిలిన విమానాలను తాత్కాలికంగా నిలిపేయవలసి వస్తుందన్నారు. 


సిల్చార్‌లోని డిఫెన్స్ ఎయిర్‌పోర్టును పాక్షికంగా డొమెస్టిక్ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ఈ ప్రాంతంలో నిర్మించవలసి ఉంది. దీని కోసం ఏవియేషన్ మినిస్ట్రీ టీమ్ ఇటీవల కచర్‌లో పర్యటించింది. 



Updated Date - 2021-11-10T18:57:41+05:30 IST