అధిక సంఖ్యలో మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-08-18T04:50:44+05:30 IST

వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆధికారులను ఆదేశించారు.

అధిక సంఖ్యలో మొక్కలు నాటాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, ఆగస్టు 17 : వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆధికారులను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ శాంతకుమారితో కలిసి బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 21న ప్రత్యేక సమావేశాలకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఎనిమిదవ విడత హరితహారం కింద జిల్లాలో 69,447 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నెల 10న వనమహోత్సవం నిర్వహించి మొక్కలు నాటామని, 21న జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మునిసి పాలిటీల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేశామని చెప్పారు. 


పట్టాభూముల సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలో పట్టా భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, తహసీల్దార్లు చొరవతీసుకొని వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ధరణి టీఎం 33లో పేర్లు, విస్తీర్ణం, మిస్సింగ్‌ సర్వే నెంబర్లు తదితరాలకు సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని,  మండలాల వారీగా వాటిని క్లియర్‌ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రణాళిక రూపొందించుకొని ప్రతీ రోజు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఆర్డీవో రాములు, ‘సి’సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజు పాల్గొన్నారు. 


పిల్లలను బడిలో చేర్పించాలి

బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా అధికారులతో మాట్లాడారు. బడి మానేసిన 14 సంవత్సరాల లోపు పిల్లల జాబితాను ప్రధానోపాధ్యాయుల వద్ద తీసుకోవాలని సూచించారు.  రెవెన్యూ, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి, బడి మానేసిన పిల్లలను, వీధి బాల లను బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, డీఈవోను ఆదేశించారు. 

Updated Date - 2022-08-18T04:50:44+05:30 IST