కొంచెం స్వచ్ఛం

ABN , First Publish Date - 2021-06-21T06:02:05+05:30 IST

పనిమీద బయటకు వచ్చే నగర వాసికి కాలుష్యం చుక్కలు చూపించేది.

కొంచెం స్వచ్ఛం

  1. కర్ఫ్యూ కారణంగా తగ్గిన కాలుష్యం
  2. పడిపోయిన కాలుష్య కారకాల విడుదల
  3. ధ్వనులు, విష వాయువుల నుంచి ఊరట
  4. వాహన సంచారం తగ్గడమే కారణం


కర్నూలు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): పనిమీద బయటకు వచ్చే నగర వాసికి కాలుష్యం చుక్కలు చూపించేది. దుమ్ము, ధూళి, వాహనాల నుంచి వెలువడే హానికారక వాయువులు, రణగొణ ధ్వనులు ఇబ్బంది పెట్టేవి. ఇంట్లో ఉన్నా.. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉండేది కాదు. కానీ కొవిడ్‌ కర్ఫ్యూ కారణంగా ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. మే నెల నుంచి వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. అనుమతించిన సమయంలో తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర వాహనాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంక్షల కారణంగా జాతీయ రహదారుల పైనా రద్దీ తగ్గింది. వెరసి.. వాయు, శబ్ద కాలుష్యం తగ్గిపోయింది. రోడ్లపై దుమ్ము, ఽధూళీ కూడా తగ్గిపోయింది. ప్రజలు కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం లభించింది. ధ్వని కాలుష్యం కూడా బాగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 


నగరం కాస్త ప్రశాంతం 


నగర జనాభా సుమారు 6.5 లక్షలు. జిల్లా వ్యాప్తంగా 15 లక్షల వాహనాలున్నాయని అంచనా! వీటిలో ఎక్కువ శాతం నగరంలోనే తిరుగుతుంటాయి. నగరం మీదుగా జాతీయ రహదారి పోతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటి ద్వారా ఏర్పడే కాలుష్య ప్రభావం స్థానికులపై తీవ్రంగా ఉంటోంది. కర్ఫ్యూ కారణంగా ఆంక్షలు ఉన్నా సమయంలో 90 శాతం వాహనాలు రోడ్ల మీదకు రావడం లేదు. గతంలో 65 డెసిబుల్స్‌ ఉన్న ధ్వని తీవ్రత ప్రస్తుతం 48కి తగ్గిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు మధ్యాహ్నమైతే నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. 


ఆ రెండూ తగ్గాయి


నగర కాలుష్యంలో ప్రధానమైనవి దుమ్ము, ధూళి రేణువులే. వాటి తీవ్రత నెలన్నరగా బాగా తగ్గింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు గుర్తించారు. మానవ రహితంగా, నిరంతరాయంగా కాలుష్యాన్ని నమోదు చేసే ఆయా కేంద్రాల్లో.. సగటు విలువలను విశ్లేషించారు. 


పీఎం (పార్టిక్యులర్‌ మేటర్‌) 2.5, పీఎం 10 విలువలు స్పష్టంగా తగ్గాయి. పీఎం 2.5 సంవత్సర సగటు 40 ఎంజీ/మీటర్‌ క్యూబ్‌ ఉండాలి. ఇది మార్చిలో 30.5, ఏప్రిల్‌ 36 నమోదైంది. కర్ఫ్యూ కారణంగా మే నెలలో ఏకంగా 20కి పడిపోయింది. ఇక పీఎం 10 సంవత్సర సగటు 60 ఉండాలి. ఇది ఏప్రిల్‌లో 75.75, మే నెలలో 41గా నమోదైంది. ఈ రెండింటి విలువలు సాధారణ సమయాల్లో పరిమితికి మించి నమోదవుతున్నాయి. నగర వాసుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 


తగ్గిన కాలుష్య కారకాలు


వాతావరణంలో సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ 50 ఎంజీ/మీటర్‌ క్యూబిక్‌, నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ 40 ఎంజీ/మీటర్‌ క్యూబిక్‌ ఉండాలి. ప్రస్తుతం మిగతా వాయు కాలుష్య కారకాల మాదిరిగానే వీటి విలువలు కూడా అదుపులోకి వచ్చాయి. నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ మార్చిలో 15.8 ఉండగా, ఏప్రిల్‌లో 15.1 ఎంజీ/మీటర్‌ క్యూబిక్‌ నమోదైంది. మే నెలలో 13.1 ఎంజీ/మీటర్‌ క్యూబిక్‌గా నమోదైంది. సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ మార్చి, ఏప్రిల్‌ నెలలో 5.7, 5.6 నమోదు కాగా, మే నెలలో 4.9 మైక్రోగ్రాములుగా నమోదైంది. నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, ఆమ్మోనియా, బెంజీన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ తదితర కాలుష్య కారకాలన్నీ సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. దీనికి తోడు నగరంలో సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ శాతం తక్కువగా ఉండే బీఎస్‌-6 రకం పెట్రోల్‌ను విక్రయిస్తుండడంతో వాహనాల నుంచి వచ్చే సల్ఫర్‌ ఆధారిత విషవాయువుల తీవ్రత ఒకింత తగ్గింది. కార్బన్‌ మోనాక్పైడ్‌ పరిమాణం కూడా కొంత తగ్గింది. కరోనా ఆంక్షలు ఉన్నా నగరం చుట్టు పక్కల ఉండే పరిశ్రమలు యథావిధిగా నడుస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి కూడా గతంలో మాదిరిగానే జరుగుతోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం పెద్దగా తగ్గలేదని అధికారులు తెలిపారు.


వాహన సంచారం తగ్గినందుకే..


నగరంలో కాలుష్య తీవ్రత, ప్రత్యేకించి దుమ్ము, ధూళి రేణువుల తీవ్రత గణనీయంగా తగ్గింది. వాహనాల సంచారం కారణంగా విస్తరించే కాలుష్య రేణువులు గాలిలో పదేపదే ఎగురుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేవి. కర్ఫ్యూ కారణంగా వాహనాల సంచారం తగ్గిపోయింది. దీంతో కాలుష్యం తగ్గడంతో పాటు కాలుష్య కారకాలు విస్తరించే అవకాశం తగ్గిపోయింది. గత సంవత్సరం లాక్‌డౌన్‌ సమయంలోనూ నగరంలో అతి తక్కువ కాలుష్యం నమోదైంది. రెండో వేవ్‌లో కర్ఫ్యూ విధించడంతో రెండు నెలల నుంచి నగరంలో కాలుష్యం తగ్గుతూ వస్తోంది.

- వై మునిప్రసాద్‌, సంయుక్త ముఖ్య పర్యావరణ ఇంజనీరు, కర్నూలు

Updated Date - 2021-06-21T06:02:05+05:30 IST