కరోనా హాట్ స్పాట్‌గా మారిన వివాహ వేడుక...ముగ్గురికి పాజిటివ్

ABN , First Publish Date - 2020-03-29T17:56:45+05:30 IST

ఓ వివాహ వేడుక కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఎగ్రా పట్టణంలో వెలుగుచూసింది....

కరోనా హాట్ స్పాట్‌గా మారిన వివాహ వేడుక...ముగ్గురికి పాజిటివ్

  • మరో 500 మంది అతిధుల హోం క్వారంటైన్

కోల్‌కతా (పశ్చిమబెంగాల్) : ఓ వివాహ వేడుక కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఎగ్రా పట్టణంలో వెలుగుచూసింది. ఎగ్రా పట్టణానికి చెందిన ఓ హోమియోపతి వైద్యుడి కుమారుడి వివాహ విందు కార్యక్రమం మార్చి 15వతేదీన జరిగింది. ఈ వివాహ విందు  కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకడంతో అప్రమత్తమైన వైద్యులు ఈ వివాహ వేడుకకు హాజరైన మరో 500 మందిని హోం క్వారంటైన్ చేశారు. ఈ వివాహానికి హాజరైన వరుడి తండ్రి స్నేహితులైన నలుగురు అతిధులు యూకే, సింగపూర్ దేశాల నుంచి వచ్చారని వైద్యుల పరిశీలనలో తేలింది. దీంతోపాటు డాక్టర్ కుమారుడి వివాహ వేడుకకు పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన అతిధులు కూడా పాల్గొన్నారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో కలవరం మొదలైంది. 


వరుడి తల్లి, అత్తకు కరోనా వైరస్ పాజిటివ్ 

కరోనా వైరస్ వ్యాధితో ఈ వివాహ విందుకు హాజరైన 66 ఏళ్ల వ్యక్తి తూర్పు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతోపాటు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ రోగికి సన్నిహితంగా ఉన్న మూడు కుటుంబాల నుంచి 13 మందిని వైద్యాధికారులు క్వారంటైన్ లో ఉంచారు. వరుడి 56 ఏళ్ల తల్లికి, 76 ఏళ్ల వయసుగల వరుడి అత్తకు కరోనా వైరస్ సోకింది. వరుడి అత్త నార్త్ 24 పరగణాస్ జిల్లా నరేంద్రపూర్ పట్టణవాసి అని తేలడంతో అక్కడి రోగి బంధువులను కూడా క్వారంటైన్ చేశారు.


వైద్యాధికారుల ఆందోళన

కరోనా వైరస్ సోకిన ముగ్గురు రోగులు ఎగ్రా పట్టణంలో జరిగిన వివాహ విందులో పాల్గొన్న వారని తేలడంతో మిడ్నాపూర్ జిల్లా వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. వరుడి తండ్రిని కూడా హోం క్వారంటైన్ చేశారు. ఈ వివాహ విందులో పాల్గొన్న 13 మంది నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు.


ఆహ్వానితుల జాబితాపై వైద్యాధికారుల ఆరా

వివాహ విందు ఆతిధ్య కుటుంబం నుంచి ఆహ్వానితుల జాబితాను సేకరించి ఆ విందులో పాల్గొన్న వారిని గుర్తించి 500 మందిని క్వారంటైన్ చేస్తున్నామని మిడ్నాపూర్ జిల్లా వైద్యఆరోగ్య శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నితై చంద్రమండల్ చెప్పారు. ఈ వివాహ విందులో పాల్గొన్న అతిధులను పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని సీనియర్ వైద్యాధికారి చెప్పారు. 


అతిధులు బస చేసిన హోటళ్లకు సీలు

ఈ వివాహ రిసెప్షన్ కు హాజరైన 66 ఏళ్ల వ్యక్తి అనంతరం సముద్ర తీరప్రాంతమైన దిఘా పట్టణంలోని ఒక హోటల్ లో రెండు రాత్రులు బసచేశారని తేలడంతో పోలీసులు ఆ హోటల్ కు సీలు వేశారు. దిఘా హోటల్ లోనే 66 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కు గురై ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ రోజు హోటల్ లో ఉన్న 34 మందిని ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ చేశారు. వివాహ విందుకు వచ్చి కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి  ఎగ్రా పట్టణంలోని రెండవ హోటల్ లో బస చేశారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారు ఆ హోటల్ ను మూసివేశారు. కరోనా రోగులు బస చేసిన హోటళ్లను శానిటైజ్ చేసి మూసి వేశారు.మొత్తంమీద ఓ వివాహ వేడుకతో ముగ్గురికి కరోనా వైరస్ సోకడం, మరో 500 మంది అతిధులు హోం క్వారంటైన్ లోకి వెళ్లడం సంచలనం రేపింది. 

Updated Date - 2020-03-29T17:56:45+05:30 IST