సంక్షేమం కోసమే బృహత్తర పథకాలు

ABN , First Publish Date - 2020-09-29T06:59:22+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే బృహత్తర పథకాలను ప్రవేశపెడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

సంక్షేమం కోసమే బృహత్తర పథకాలు

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి 

శామీర్‌పేటలో రూ.84లక్షల జడ్పీ నిధులతో

చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన 


శామీర్‌పేట: తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే బృహత్తర పథకాలను ప్రవేశపెడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేటలో సోమవారం రూ.84లక్షల జడ్పీ నిధులతో కలిసి చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు హక్కులు కల్పిచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. రైతుబీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకాలతో రైతులు ఎంతో ఆనందోత్సవాలతో పంటలను సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం మౌలిక సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. రైతుల వ్యవసాయ భూములు అవకతవకలకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరలో ధరణీ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. జడ్పీచైర్మన్‌, జడ్పీటీసీ అనితలు జడ్పీ నుంచి అధిక నిధులను తీసుకొచ్చి మండలంలో పలు అభివృద్ధి పనులను చేయిస్తున్నారని మంత్రి అభినందించారు. అనంతరం కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలతో కలిసి మొక్క నాటి నీరు పోశారు.


శామీర్‌పేట మండలంలోని మజీద్‌పూర్‌, యాడారం, తుర్కపల్లి, మురహరిపల్లి, లాల్‌గడి మలక్‌పేట, బొమ్మరాసిపేట, పొన్నాల్‌, బాబాగూడ గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లూభాయి, వైస్‌ ఎంపీపీ ఎల్లుసుజాతలు పర్యటిస్తూ పలు గ్రామాభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైసచైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సునీతలక్ష్మీ, మూడుచింతలపల్లి ఎంపీపీ హారికమురళి, వైస్‌ ఎంపీపీ సుజాత, అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, జడ్పీ సీఈవో దేవసహాయం, డీపీవో పద్మజారాణి, తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీడీవో వాణి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T06:59:22+05:30 IST